పూడికతీతలో ‘తమ్ముళ్ల’ దోపిడీ
ఉపాధి పనుల పేరుతో మట్టి అమ్మకం
చెరువు గట్టు పటిష్టానికి చర్యలు శూన్యం
అచ్యుతాపురం: చెరువు పూడిక తీత పేరుతో టీడీపీకి చెందిన నాయకులు మట్టి అమ్మకాలు జరిపి లక్షలాది రూపాయలు స్వాహా చేస్తున్నారు. చీమలాపల్లి చెరువులో పూడికతీత పనుల నిమిత్తం రూ.40 లక్షల అంచనా వ్యయంతో పనులు మంజూరయ్యాయి. కూలీలు అందుబాటులో లేని కారణంగా యంత్రాల సహాయంతో పూడికలు తొలగించేందుకు చీమలాపల్లి పంచాయతీలో ఒక తెలుగు తమ్ముడు కలెక్టర్ యువరాజ్ నుంచి అనుమతి తీసుకువచ్చారు. ఇక్కడ తొలగించిన మట్టిని చెరువు గట్టుపటిష్టం చేసేందుకు వినియోగించాల్సి ఉన్నప్పటికీ, దీనికి విరుద్ధంగా మట్టిని యథేచ్చగా బయట విక్రయించుకుంటున్నారు. తన సొంత పొక్లయిన్, లారీలు, ట్రాక్టర్లను వినియోగించి పూడికలు తొలగిస్తున్నారు. తొలగించిన మట్టిని కొండకర్ల ఆవ, ఆవసోమవరం, ఆవరాజాం గ్రామాల పరిధిలో ఉన్న లే అవుట్లు కప్పేందుకు వినియోగిస్తున్నారు.
చెరువులో మట్టిని తొలగించేందుకు ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయలతో పాటు ఈ మట్టి అమ్మకం చేపట్టడం వల్ల మరింత ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం చేపడుతున్న పూడికతీతతో రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ యువరాజ్ అనుమతి ఉందని, పూడికతీత పనులు చేపట్టేది అధికార పార్టీ నాయకులు కావడంతో ఏ ఒక్క అధికారి ఇటువైపు కన్నెత్తై చూడడం లేదు. దీంతో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని టీడీపీ నాయకుడు స్వాహా చేస్తున్నారు. ఇకనైనా అధికారులు పర్యవేక్షించి చెరువులో మట్టి తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.