రెసిడెంట్ డాక్టర్ల సమ్మె
ముంబై: తమ సహోద్యోగిపై దాడి చేసిన షోలాపూర్ పోలీసులను సస్పెండ్ చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల మంది రెసిడెంట్ డాక్టర్లు గురువారం నుంచి సమ్మెకు దిగారు. షోలాపూర్‌లో ఓ డాక్టర్‌పై గత నెల 31న ముగ్గురు పోలీసులు దాడి చేసి కొట్టినట్టు వార్తలు వచ్చాయి. వీరిపై డాక్టర్ల రక్షణ చట్టం 2008 కింద నాన్-బెయిలబుల్ కేసు పెట్టి అరెస్టు చేయాలని డాక్టర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మినహా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్ల సంఘం (ఎంఏఆర్డీ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ హర్షల్ పన్షేవ్దికర్ ఆరోపించారు. షోలాపూర్ మెడికల్ కాలేజీ డాక్టర్ ఒక అత్యవసర కేసుతో బిజీగా ఉన్నప్పుడు ముగ్గురు పోలీసులు వచ్చారు. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వైద్యసాయం అందించాలని కోరారు. ఆమెను ప్రసూతి వార్డుకు తీసుకెళ్లాలని సూచించడంతో ఆగ్రహం చెందిన పోలీసులు సదరు డాక్టరును చితకబాదారని హర్షల్ అన్నారు. ఆందోళన కొనసాగినప్పటికీ వైద్యసేవలకు అంతరాయం రాకుండా చూస్తామని ఎంఏఆర్డీ వైద్యాధికారులు తమకు హామీ ఇచ్చారని హర్షల్ వివరించారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి సమాచారమూ అందలేదని ఆయన వివరించారు.