Soldiers Welfare Fund
-
‘ఓఆర్ఓపీ’కి కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: ఒకే ర్యాంకు–ఒకే పెన్షన్ (ఓఆర్ఓపీ) అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాజీ సైనికులతో రాహుల్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సైనికుల సంక్షేమం, ఓఆర్ఓపీ అమలు తదితర అంశాలపై వారితో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఓఆర్ఓపీ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపడితే ఓఆర్ఓపీతో సహా సైనికుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రఫేల్ వ్యవహారంలో అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లు కేటాయించిన మోదీ సర్కార్కు సైనికుల డిమాండ్ల పరిష్కారానికి మాత్రం చేతులు రావటం లేదని విమర్శించారు. జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని, దీని వల్ల సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రాహుల్ విమర్శలకు అధికార బీజేపీ దీటుగా సమాధానం ఇచ్చింది. అధికారంలో ఉండగా ఎన్నడూ సైనికుల సంక్షేమంపై మాట్లాడని రాహుల్ ఇప్పుడు తమను విమర్శించటం సిగ్గుచేటని బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బరూనీ విమర్శించారు. అధికారం కోల్పోయి నాలుగున్నరేళ్ల తర్వాత గానీ ఆయనకు సైనికులు గుర్తుకు రాలేదని ఎద్దేవా చేశారు. -
'సైనికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి'
-
'సైనికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి'
హైదరాబాద్ : మాజీ సైనికులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. మంగళవారం ఉదయం సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఈ నిధికి ఏడాదికి మంత్రులు రూ.25వేలు, ఎమ్మెల్యేలు రూ.10 వేలు వారి జీతాల నుంచి విరాళంగా ఇస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన మాజీ సైనికులకు రెండు పెన్షన్లు పొందే వెసులుబాటు కల్పిస్తామన్నారు. వరంగల్లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు జాతీయ అవార్డులు పొందిన సైనికులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున భారీగా నజరానాలు ప్రకటించారు. పరమవీరచక్ర అవార్డు గ్రహీతలకు రూ. 20 కోట్లు, మహావీరచక్ర, కీర్తిచక్ర అవార్డు పొందిన వారికి రూ.1.25 కోట్లు, వీరచక్ర, శౌర్యచక్ర అవార్డులు పొందిన వారికి రూ.75 లక్షలు, సేనా మెడల్ గ్యాలంటరీ అవార్డు పొందిన వారికి రూ.30 లక్షలు ఇస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. పది రోజుల విరామం తర్వాత అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మంగళవారం తిరిగి ప్రారంభమైయ్యాయి. అసెంబ్లీలో ప్రతిపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అర్చకులు, దేవాదాయ ఉద్యోగులకు ట్రెజరీల ద్వారా జీతాలు చెల్లించే అంశంపై బీజేపీ, రోహిత్ వేముల మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, ఎన్టీఆర్ వర్థంతిని అధికారికంగా నిర్వహించాలని టీడీపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.