‘సాగర’మంత చరిత్ర
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో మానవశక్తితో నిర్మితమైన ఈ బహుళార్థ సాధక నాగార్జున సాగరానిది ఘనచరిత్ర. ప్రాజెక్టు నుంచి తొలిచుక్క నీరు అన్నదాతకు చేరువైన 1967, ఆగస్టు 4 నుంచి 48 ఏళ్లుగా ఇది పండించిన పంటలు, సేద్యం చేసిన భూములు కోకొల్లలు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను ధాన్య భాండాగారంగా, భవిష్యత్ తెలంగాణను వ్యవసాయ రారాజుగా చేసిన, చేయగలిగిన సామర్థ్యం ఈ ప్రాజెక్టుది. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు 3.60 కోట్ల ఎకరాల్లో పంటలు పండాయం టే (కేవలం ఎడమ కాల్వ ద్వారా నల్లగొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో) అతిశయోక్తి కాదు. 48 ఏళ్లుగా నిర్విరామంగా కనీసం ఒక్క పంటకైనా నీరందిస్తూ అన్నదాతకు ఉపాధి కల్పిస్తూ, సామాన్య ప్రజానీకానికి గుప్పెడన్నం తినిపిస్తున్న ఈ ప్రాజెక్టు ఎడమకాల్వ కింద ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకుందామా...!
మొత్తం 7,500 టీఎంసీల వరకు..
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు ఎడమ కాల్వ పరిధిలో పంట పొలాలకు చేరిన నీరు 7,500 టీఎంసీలని లెక్కలు చెపుతున్నా యి. గత 48 ఏళ్లలో ఏ ఏడాది ఎన్ని నీళ్లు విడుదలయ్యాయి... ఎన్ని లక్షల ఎకరాల్లో మెట్ట, మాగాణి పంటలు పండాయనే విషయాన్ని పరిశీలిస్తే తేలిన లెక్క ఇది. ఇప్పటివరకు 12 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా 200 టీఎంసీలకు పైగా నీరు విడుదలైంది. కేవలం 5 సార్లు మాత్రమే 100 టీఎంసీల కన్నా తక్కువ నీరు విడుదలైంది. అత్యధికంగా 1998-99 సంవత్సరంలో 232.94 టీఎంసీల నీటిని సాగర్ ప్రాజెక్టు ద్వారా విడుదల చేయ గా, అత్యల్పంగా 2003-04లో 20.49 టీఎంసీ ల నీటిని విడుదల చేశారు.
ఈ నీటితో ఇప్పటివరకు 48 ఏళ్ల ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి 3.60 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మాగా ణి పంట అయిన వరి ఈ ప్రాజెక్టు కింద ప్రధాన పంట కాగా, పత్తి, మిరప, కంది, జొన్న లాంటి మెట్ట పంటలు కూడా సాగవుతున్నాయి. వర్షా లు, నీటి లభ్యతను బట్టి ఆయా రకాల పంట లను రైతులను ఈ ప్రాజెక్టు ద్వారా పండిస్తుండగా, ఇప్పటివరకు రెండుకోట్ల ఎకరాల్లో వరి పంట పండిందని లెక్కలు చెపుతున్నాయి. రెండుకోట్ల ఎకరాల్లో వరి పంట అంటే.. ఇప్పటి లెక్కల ప్రకారం దానిని పంట ఉత్పత్తిలో లెక్కగడితే 4.4 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందన్నమాట.
ఇక, మెట్ట పంటై లెతే కోటిన్నర ఎకరాల్లో ఇప్పటివరకు సాగయ్యాయి. మొత్తంమీద చూస్తే సాలీనా సగటున 7.64లక్షల ఎకరాల్లో ఈ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు పంటలు పండించడం గమనార్హం. అయితే, ఈ ప్రాజెక్టు కింద 14.5లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. స్థిరీకరణ కోణం లో ఆలోచిస్తే కేవలం సగం ఆయకట్టుకు మాత్ర మే నీరందుతోందని అర్థమవుతోంది. ఇందుకు కర్ణుని చావుకి ఉన్న కారణలున్నాయని నిపుణులంటున్నారు. వర్షాలు, నీటి లభ్యతతో పాటు నీటిపారుదల అధికారుల నిర్లక్ష్యం, నిధుల విడుదలలో జాప్యం, కాల్వల్లో పూడిక తీయకపోవడం లాంటి అనేక కారణాలున్నాయి.
చుక్క నీరు కూడా రాని క్షణాలున్నాయి
సాగర్ నుంచి పంటలు పండించుకునేందుకు చుక్కనీరు విడుదల చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తం ఇప్పటివరకు ఏడు సీజన్లలో సాగర్ నుంచి సాగునీరు విడుదల చేయలేదు. మొదటిసారిగా ప్రాజెక్టు నుంచి నీరు విడుదలయిన 15 ఏళ్ల తర్వాత 1980-81, 1981-82 సంవత్సరాల్లో రబీ సీజన్‌కు (రెండో పంటకు) నీటి విడుదల చేయలేదు. ఆ త ర్వాత 85-86, 86-87 రబీ సీజన్లలో కూడా అదే జరిగింది. 2002-03, 2011-12 రబీ సీజన్లలోనూ నీటిని విడుదల చేయలేదు. ఇక, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి గత 48 ఏళ్లలో ఒకే ఒక్కసారి ఖరీఫ్ సీజన్లో నీటి విడుదల జరగలేదని లెక్కలు చెపుతున్నాయి. 2009-10 ఖరీఫ్‌లో నీళ్లు రాలేదు. కానీ ఆ సంవత్సరం రబీలో 154.94 టీఎంసీల నీటిని విడుదల చేయగా, 8.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
మానవ నిర్మిత జల మందిరం విశేషాలివి...
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో భాగంగా సాగునీటి కొరకు కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. కుడికాలువను జవహర్ కాలువగా, ఎడమకాలువను లాల్‌బహుదూర్ కాలువగా పిలుస్తారు. జవహర్ కాలువ సాగర్ రిజర్వాయర్ నుంచి ఆనకట్టకు కుడివైపు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కాలువ పనులను అప్పటి ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఆక్టోబర్ 10, 1956న ప్రారంభించారు. దక్షిణ విజయపురి వద్ద ఈ కాలువ సొరంగ మార్గం ద్వారా ప్రారంభమై 392 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలలో 20లక్షల 62వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.
రిజర్వాయర్ ఎడమవైపు నుంచి ప్రారంభమయ్యే కాలువకే లాల్‌బహుదూర్ కెనాల్ అని పేరు. ఈ కాలువ పొట్టిచెలమ నుంచి చలకుర్తి వరకు సొరంగమార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఈ కాలువ నిర్మాణాన్ని నాటి గవర్నర్ భీమ్సేన్ సచార్ 1959లో ప్రారంభించారు. ఈ కాల్వ పొడవు 349కిలో మీటర్లు. ఈ కాలువ కింద 14లక్షల 50వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. రిజర్వాయర్ నీటిమట్టం 489 అడుగుల పైన ఉన్నప్పుడు కుడికాలువలాగే ఈ కాలువకు కూడా నీటిని విడుదల చేయవచ్చు. ఈ కాలువ నిర్మాణానికి సుమారు రూ. 675 కోట్లు వ్యయమైనట్లు అంచనా.
సాగర్ ప్రాజెక్టు కింద ఏడాదికి సగటున కనీసం రూ.1500కోట్ల విలువైన వ్యవసాయం జరుగుతుందని ప్రణాళికల లెక్కలు చెపుతున్నాయి. తొలిసారి ఈ కాల్వల నుంచి ఆగస్టు4, 1967న నాటి ప్రధాని ఇందిరాగాంధి నీటిని వదిలారు. ఈ సాగర్జలాశయం విస్తీర్ణం 110 చదరపు మైళ్లు కాగా, గరిష్టనీటిమట్టం 590 అడుగులు, డెడ్స్టోరేజిలెవల్ 490 అడుగులు. నిల్వనీటి సామర్థ్యం 408 టీఎంసీలు కాగా, డెడ్‌స్టోరేజీ 168 టీఎంసీలు.