the solution
-
ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: హరీశ్‌రావు
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. గతంలో పత్రికా ఫొటోగ్రాఫర్లకు ఫొటో జర్నలిస్టుగా అక్రిడిటేషన్ ఉండేదని, కానీ నేడు ఫొటోగ్రాఫర్‌గా మార్పు చేయడం వలన ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో.. అవార్డులు అందుకున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లు శివప్రసాద్, యాకయ్య, వేణుగోపాల్, సతీశ్, శివకుమార్, భాస్కరాచారి, రాజే శ్‌రెడ్డి, ఠాకూర్ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫొటోజర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్లో గెలుపొందిన ఫొటోగ్రాఫర్లకు ఆదివారం రవీంద్రభారతిలో బహుమతులు ప్రదానం చేశారు. హరీశ్ మాట్లాడుతూ దినపత్రికల్లో వార్త పూర్తిగా చదవకపోయినప్పటికీ ఫొటోను చూసి సారాంశం గ్రహించవచ్చని చెప్పారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రూ.100 కోట్లు జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం కేటాయించిందని, త్వరలో జర్నలిస్టు భవనం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజలతో సమావేశమయ్యారు. ముందుగా ఎంపీ తన వద్దకు వచ్చిన ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారి సమస్యలను ఓపికగా విని పరిష్కారం కోసం అధికారులకు ఫోన్లు చేశారు. చిన్నకుడాల గ్రామానికి చెందిన బీసీ కాలనీ మహిళలు తమ కాలనీకి పార్నపల్లె నీరు రావడం లేదని ఎంపీకి మొరపెట్టుకోగా.. ఆయన సంబంధిత అధికారి డీఈ మోహన్‌కు ఫోన్ చేసి శనివారం రాత్రిలోగా కాలనీకి నీరు వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతేకాకుండా ఎంపీ నిధుల ద్వారా గ్రామంలో సంప్ ఏర్పాటు చేస్తానని శాశ్వతంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కొంత మంది రేషన్ డీలర్లు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అధికారులు చిన్న చిన్న తప్పులను సాకుగా చూపి వేధిస్తున్నారని ఆయన దృష్టికి తేగా, అందుకు ఎంపీ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు వెంగముని, సింహాద్రిపురం పరిధిలోని సమస్యలు ఆయన దృష్టికి తేగా, పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కొంత మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోరగా.. వివిధ కంపెనీల ప్రతినిధులకు సిఫార్సు చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, రామగిరి జనార్థన్‌రెడ్డి, నల్లపురెడ్డిపల్లె బలరామిరెడ్డి, వేముల సాంబ శివారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
బూజు దులిపారు
తొలిసారిగా ఆదివారం విధులకు హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు మూడేళ్లుగా పేరుకుపోయిన రెండు లక్షల ఫైళ్లు ఒక్క రోజులోనే 50 వేల ఫైళ్లు పరిష్కారం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వినడానికి ఆశ్యర్యమనిపించినా ఇది నిజం. ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవైనప్పటికీ, రాష్ర్ట సచివాలయం...విధాన సౌధ, వికాస సౌధతో పాటు ఎంఎస్ బిల్డింగ్‌లోని కార్యాలయాన్నీ పని చేశాయి. ఏళ్ల తరబడి గుట్టలుగా పేరుకుపోయిన ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించడానికి ఆదివారం కూడా పని చేయాలని గత మంత్రి వర్గ సమావేశంలో చేసిన తీర్మానం మేరకు వివిధ శాఖల అధికారులు ఆ ‘యజ్ఞం’లో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ ఫైళ్ల పరిష్కార పనులను పర్యవేక్షించారు. రెవెన్యూ, ఆరోగ్య, విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, సహకార శాఖల అధికారులు ఫైళ్ల బూజు దులిపి, పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. పాలనా సంస్కరణలు, సిబ్బంది వ్యవహారాల శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. గతంలో ఫైళ్ల సత్వర పరిష్కారానికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టినా, ఆదివారం పని చేయడం ఇదే తొలిసారని చెబుతున్నారు. వివిధ శాఖల్లో అనేక ఫైళ్లు మూడేళ్ల నుంచి పెండింగ్‌లో పడి ఉన్నాయి. ఇలాంటి ఫైళ్లు సుమారు రెండు లక్షల వరకు ఉండవచ్చని అంచనా. పెండింగ్ ఫైళ్ల విషయంలో రెవెన్యూ, విద్యా శాఖలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కన్నెర్ర చేశారు. ఆదివారం అని కూడా చూడకుండా ఫైళ్లను శీఘ్రగతిన పరిష్కరించాలని ఆయన అధికారులను ఇదివరకే ఆదేశించారు. 50 వేల ఫైళ్ల పరిష్కారం ఆదివారం ఉదయం నుంచి సాయంత్రానికి సుమారు 50 వేల ఫైళ్లు పరిష్కారానికి నోచుకున్నాయని కౌశిక్ ముఖర్జీ తెలిపారు. ప్రజలకు సంబంధించిన అత్యవసర ఫైళ్లను 48 గంటల్లోగా పరిష్కరించాలని అధికారులకు సూచించామని చెప్పారు. నిర్ణీత గడువులోగా ఫైళ్లను పరిష్కరించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యాయ స్థానాల్లో విచారణ దశలో ఉన్న వ్యవహారాలకు సంబంధించినవి మినహా, మిగిలిన అన్ని ఫైళ్లను పరిష్కరిస్తామని వివరించారు. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల ఫైళ్లు పేరుకు పోతున్నాయని చెప్పారు. ఏదేమైనా మరో రెండు రోజుల్లో పెండింగ్ ఫైళ్లను పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.