20 మంది జిల్లా అధికారులకు చార్జ్ మెమోలు
హన్మకొండ అర్బన్ : జిల్లాల విభజన నేపథ్యంలో కొత్త భవనాలు, ఉద్యోగుల పంపకాలు వంటి సమస్యలతోపాటు గ్రీవెన్స్‌సెల్ సమస్యల పరిష్కారం, అవినీతి ఆరోపణలపై చర్యలు వంటి అంశాలపై కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ వాకాటి కరుణ సమీక్షించారు. కాగా, సమావేశానికి సు మారు 20 మంది జిల్లా అధికారులు గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ సమావేశానికి హాజరుకాని అధికారులకు చార్జ్ మెమోలు ఇవ్వాలని డీఆర్వోను ఆదేశించారు.
ప్రతి శనివారం సమావేశం
గ్రీవెన్స్ సమస్యల పరిష్కారం, టోల్ ఫ్రీ నంబర్లకు వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ప్రతి శనివారం కలెక్టరేట్లో సమావేశం ఉంటుందని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. తమకు వచ్చిన ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిష్కరించి నివేదికలతో రావాలని సూచించారు. గ్రీవెన్స్ పరిష్కారాలపై అలసత్వం వహిస్తే సహించేదిలేదని అధికారులను హెచ్చరించారు. గ్రీవెన్స్ సమస్యలు, టోల్ ఫ్రీ నంబర్ల ఫిర్యాదుల పరిష్కారం, పర్యవేక్షణకు ప్రతీ శాఖలో ఒక అధికారిని నోడల్ అధికారిగా నియమించాలన్నారు. సమా వేశంలో జేసీ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ఏజేసీ తిరుపతిరావు, డీఆర్వో శోభ, ఇతర అధికారులు పాల్గొన్నారు.