యువకుడి దారుణ హత్య
వంగాల (గుండాల) : గుండాల మండలం తుర్కలశాపురం గ్రామ పంచాయతీ పరిధి వంగాల గ్రామానికి చెందిన యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాయం కృష్ణారెడ్డి-జయమ్మల రెండవ కుమారుడు గాయం సోమశేఖరరెడ్డి (32) తాగుడు, చెడు అలవాట్లకు బానిసై ఇంటి వద్ద ఉండకుండా ఆవారాగా తిరుగుతుండే వాడు. తండ్రి మరణించడంతో తల్లి జయమ్మ వంగాల కొత్త కాలనీలో నివాసం ఉంటోంది. సోమశేఖరరెడ్డి సోదరుడు మహేందర్‌రెడ్డి వృత్తి రీత్యా భువనగిరిలో నివాసం ఉంటున్నాడు.
సోమశేఖరరెడ్డి తాగుడుకు బానిసై వారానికి ఒకసారి స్వగ్రామానికి వచ్చి తల్లి జయమ్మను దూషించి డబ్బులు తీసుకుని తిరిగి వెళ్లిపోయేవాడు. అయితే ఈ నెల 14న గ్రామానికి చేరుకున్న సోమశేఖరరెడ్డి పొన్నగాని వీరేషం వద్ద కల్లు తాగి గ్రామంలోని గుబ్బ కోటేశ్వర్ కిరాణం కొట్టులో బెండకాయలు కొనుగోలు చేసి పాత కాలనీలో ఉన్న తన ఇంటికి పోయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అదే రోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సోమశేఖరరెడ్డిపై దాడి చేసి తలపై గట్టిగా కొట్టి హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత దుండగులు ఇంటి ఆవరణలోనే ఉన్న వ్యవసాయ బావిలో మృతదేహాన్ని పడవేసి వెళ్లిపోయారు.
దుర్వాసన వస్తుండడంతో..
మంగళవారం ఉదయం దుర్వాసన రావడంతో గ్రామ సేవకుడు వ్యవసాయ బావిలో చూడడంతో మృతదేహం కనిపించింది. మృతుడి సోదరుడు గాయం మహేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎస్.మధుసూదన్‌రెడ్డి తెలి పారు. మృతదేహం కుళ్లిపోవడంతో సంఘటన స్థలానికే ఆలేరు వైద్యాధికారిని పిలిపించి పోస్టుమార్టం నిర్వహించారు. రామన్నపేట ఇన్చార్జి సీఐ శివరాంరెడ్డి, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో సంఘటన స్థలానికి చేరుకొని గుర్తు తెలియని వ్యక్తుల..?గ్రామస్తులు ఎవరైనా హత్య చేసి ఉంటారా...? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.