అర్హుల పింఛన్ల రద్దు అన్యాయం
నూజివీడు : సెంటుభూమి కూడా లేకపోయినా ఐదు ఎకరాలు ఉందంటూ అర్హుల పింఛన్లను ఎలా తొలగిస్తారంటూ టీడీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మున్సిపల్ అధికారులను నిలదీశారు. పట్టణంలోని 17వ వార్డులో శనివారం నిర్వహించిన జన్మభూమి-మావూరు వార్డుసభలో ఆయన పాల్గొన్నారు. తమ పేరిట సెంటుభూమి లేకపోయినా పింఛన్లను తొలగించారంటూ టీడీపీ నాయకులు మోచర్ల కృష్ణంరాజు వద్ద పలువురు వృద్ధులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఆయన పింఛన్లు ఎందుకు తొలగించారంటూ అధికారులను నిలదీశారు.
అదే సమయంలో వార్డుసభ వద్దకు చేరుకున్న ముద్దరబోయిన.. పింఛన్ పొందడానికి అర్హులైనా ఎందుకు తొలగించారంటూ మున్సిపల్ డీఈ రవికుమార్నుప్రశ్నించారు. దీనికి డీఈ బదులిస్తూ వార్డుస్థాయిలో నియమించిన పింఛన్ వెరిఫికేషన్ కమిటీ తొలగించలేదని, హైదరాబాద్ నుంచే తొలగించినవారి జాబితా వచ్చిందన్నారు. దీనికి ముద్దరబోయిన స్పందిస్తూ స్థానిక అధికారులు రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరణ చేసేటపుడు తప్పుల తడకలుగా చేయడం వల్లే నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందన్నారు.
పింఛను ఎలాగు పోయిం ది కాబట్టి ఆమెకు ఉందన్న ఐదెకరాల భూమి ఎక్కడుందో చూపితే దానిని కౌలుకు ఇచ్చుకొని అయినా జీవిస్తారని, ఆ భూమిని చూపిస్తారా అని అధికారులను ప్రశ్నించారు. దీంతో అవాక్కయిన అధికారులు సరైన సమాధానం చెప్పలేక కొద్దిసేపు నీళ్లు నమిలారు. ఈ పరిస్థితులలో మున్సిపల్ కమిషనర్ చెరువు శ్రీనివాస్ అక్కడకు వచ్చారు. అర్హత ఉండి కూడా పింఛను రద్దయిన వారి వివరాలను సేకరిస్తున్నామన్నారు. జన్మభూమి కార్యక్రమం పూర్తయిన తరువాత పరిశీలన చేసి అర్హుల వివరాలను ప్రభుత్వానికి పంపుతామన్నారు.
ఈ విధంగా చేయమని వీడియోకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చెప్పారని తెలపడంతో ముదరబోయిన శాంతించారు. అనంతరం వార్డుసభ ప్రశాంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మద్దాల రూత్మెర్సీ, మున్సిపల్ ఏఈ సోమేశ్వరరావు, టీపీఎస్ రాజన్, పశువైద్యాధికారి ఠాగూర్, టీఎంసీ జానపాటి ఉషారాణి, ఆరో వార్డు కౌన్సిలర్ చెరుకూరి దుర్గాప్రసాద్, టీడీపీ నాయకులు కదం కండోజి, తిరుమలశెట్టి సత్యం, రామెళ్ల రంగారావు తదితరులు పాల్గొన్నారు.