చట్టం చట్రంలో.. పిచ్చి..ప్రేమ!
తల్లినయ్యాననే విషయమే తెలియని పిచ్చితల్లి ఒకామె.. కొద్ది గంటల లాలనలోనే పుత్రప్రేమామృతాన్ని ఆస్వాదించిన తల్లి ఇంకొకామె.. ఇంతలో చట్టం అడ్డొచ్చింది.. తన పని తాను చేసుకుపోయింది. జన్మనిచ్చిన పిచ్చితల్లి వద్ద వదిలేయలేక.. అలా అనీ పెంచుకుంటానని మమకారం చూపించిన తల్లికి అప్పగించడానికి రూల్స్ అంగీకరించక.. ఆ బిడ్డను శిశుగృహ చట్రంలో ఇరికించింది. శ్రీకాకుళం పీఎన్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికుల హృదయాలను కదిలించేసింది. చట్టం ఆ శిశువును ఏ గూటికి చేరుస్తోందనన్న చర్చకు తావిచ్చింది.
శ్రీకాకుళం క్రైం:మంగళవారం.. అప్పుడే తెల్లవారుతోంది.. ఈ లోకంలోకి మరో శిశువు అడుగుపెట్టింది. పీఎన్ కాలనీ లోని వేంకటేశ్వర స్వామి గుడి సమీపంలో మతిస్థిమితం లేని ఓ మహిళ ఆ మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే తాను తల్లినయ్యాననే విషయం ఆ పిచ్చితల్లికి తెలియదు. నడిరోడ్డు మీద పడి ఉన్న తల్లీబిడ్డలను గమనించిన శాంతమ్మ అనే స్థానికురాలు అయ్యో.. అంటూ దగ్గరకెళ్లి శిశువును శుభ్రం చేసింది. అనంతరం తనకు వరుసకు కూతురు అయ్యే ఎం.లలితకు ఆ శిశువును అప్పగించింది. లలిత సోదరి ఎల్.ధనలక్ష్మికి ఒక పాప ఉండగా.. ఇద్దరు కొడుకులు పుట్టి చనిపోయారు.
కొడుకుల్లేని తన చెల్లెలి కోసం శిశువును తీసుకున్న లలిత ఇచ్చిన సమాచారం మేరకు కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న ధనలక్ష్మి శిశువున అక్కున చేర్చుకొని శుభ్రం చేసి.. పాలు పట్టి లాలించింది. ఈ విషయం ఆనోటా.. ఈనోటా పాకి.. చివరికి బాలల సంరక్షణ అధికారులకు తెలిసింది. దాంతో వారు రంగంలోకి దిగారు. మతిస్థిమితం లేని బాలింతతోపాటు.. ఆమె ప్రసవించిన శిశువునూ ధనలక్ష్మి నుంచి తీసుకొని రిమ్స్‌కు తరలిం చారు. అక్కడ శిశువుకు వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో శిశుగృహకు తరలించారు.
బాబును మాకప్పగించండి
మగపిల్లలు లేనందున ఆ శిశువును పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని.. బిడ్డను తమకు ఇచ్చేయాలని ధనలక్ష్మి భోరున విలపిస్తూ ప్రాధేయపడినా అధికారులు, చైల్డ్‌లైన్ సభ్యులు అంగీకరించలేదు. మతిస్థిమితం లేని కన్నతల్లి ఎలాగూ పెంచలేదు.. శిశుగృహకు తరలించి.. ఇంకెవరికో ఇచ్చే బదులు తమకే ఇస్తే మగపిల్లలు లేని లోటు తీరుతుందని.. అల్లారుముద్దుగా పెంచుకుంటామని ఆమె చేసిన విన్నపాలు ఫలించలేదు.
ఆ పిచ్చితల్లికి ఇది రెండో కాన్పు
కాగా మతిస్థిమితం లేని మహిళకు ఇది రెండో కాన్పు అని బాలల సంరక్షణాధికారి ఐ.లక్ష్మీనాయుడు చెప్పారు. ఆయన కథనం ప్రకారం.. పొందూరు మండలం రాపాక గ్రామానికి చెందిన కొంచాడ పార్వతి మతిస్థిమితం కోల్పోయి కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వచ్చేసింది. వారు వీరు ఇచ్చినది తింటూ కాలం వెళ్లదీస్తోంది. ఆమెపై కామాంధులెవరో కన్నేసి కోరిక తీర్చుకున్నారు. దీంతో ఆమె గర్భం దాల్చి మంగళవారం ప్రసవించింది. ఇదే రీతి లో గతంలో నవభారత్ జంక్షన్ వద్ద కూడా ఒక శిశువుకు జన్మనిచ్చింది. అప్పుడు కూడా స్థానికులెవరో తీసుకెళ్లడానికి ప్రయత్నించగా తాము వెళ్లి చట్టప్రకారం శిశువును స్వాధీనం చేసుకున్నామని లక్ష్మీనాయుడు వివరించారు. ఇప్పుడూ అదే పని చేశామని, పిల్లలు లేని వారికి చట్ట ప్రకారం దత్తత ఇస్తామని వివరించారు. ఆయన వెంట చైల్డ్‌లైన్ కో-అర్డినేటర్ కె.నరేష్, టీమ్ సభ్యురాలు శ్రీలక్ష్మి ఉన్నారు. కాగా ప్రసవించిన శిశువును ఆ పిచ్చితల్లే అమ్మేసిందన్న ఆరోపణలు విని పించాయి. దీనిపై పిచ్చితల్లి పార్వతిని అడగ్గా.. ఏదేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడింది. ఈ ఆరోపణను ధనలక్ష్మి ఖండించింది.