త్వరలో ఆ సేవలందించనున్న టెల్కోస్ ?
న్యూఢిల్లీ: తరచూ కాల్ డ్రాప్ సమస్యతో విసిగిపోయిన వినియోగదారులకు ఇది గుడ్ న్యూస్. ఇంటర్నెట్ ఆధారిత కాల్స్ ను ఆఫర్ చేసేందుకు టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) రంగం సిద్ధం చేస్తోంది. ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసుల ద్వారా వాట్స్ యాప్, స్కైప్ లో ఉన్న కాలింగ్ సదుపాయాన్నందించేందుకు ట్రాయ్ కసరత్తు చేస్తోంది. ఈ సేవల సాధ్యాసాధ్యాలపై టెల్కోస్ తో చర్చలు జరపనుంది.
వాట్స్ యాప్, స్కైప్ లతో సమానంగా ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసుల ద్వారా వాయిస్ కాలింగ్ సేవలందించాలని యోచిస్తున్నట్టు ట్రాయ్ ఛైర్మన్ ఆర్ ఎస్ శర్మ వెల్లడించారు. ఒకవైపు ఇతర ప్రొవైటర్లు ఈ ఇంటర్నెట్ టెలిఫోనీ అందిస్తుండగా, తమ సర్వీసు ప్రొవైడర్లు లెసెన్స్ లేకుండా ఈ వాయిస్ ఓవర్ సేవలను అందించలేరనీ దీంతో రెగ్యులేటరీ అసమతుల్యత నెలకొందని శర్మ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని కొంతమేరకైనా చక్కదిద్దాలనే ప్రణాళిలో ఉన్నట్టు తెలిపారు. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇతర ప్రొవైడర్లు అందిస్తున్న సర్వీసులను తాము కూడా అనుమతించనున్నామని చెప్పారు.
ప్రపంచవ్యాపితంగా ఈయూ, అమెరికా సహా పలు మార్కెట్ టెల్కోస్ లలో ఈ వాయిస్ ఓవర్ సేవలు అందించడానికి అనుమతి ఉందన్నారు. దీనిపై పరిశ్రమలో భారీ చర్చ జరుగుతోందని తెలిపారు.
కాగా టెలికం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ డిసెంబర్ 2014 లో ఇంటర్నెట్ ఆధారిత కాల్స్ ప్రారంభించింది. దీనికి ప్రత్యేకంగా చార్జి వసూలు చేయాలని నిర్ణయంపై నిరసన వెల్లువెత్తడంతో ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.. మరి ట్రాయ్ తాజా ప్రతిపాదన ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.