Sophie Cruz
-
మాటలు కావవి తూటాలు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతల స్వీకరణపై అమెరికాలో భారీ నిరసనలు జరిగాయి. పాప్‌సింగర్ మడోన్నా శ్వేతసౌధాన్ని పేల్చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సెలెబ్రిటీ కాబట్టి సహజంగానే ఆమె మాటలు ప్రకంపనలు రేపాయి. ఎలాంటి సెలెబ్రిటీ కాకున్నా.. ఓ ఆరేళ్ల చిన్నారి ట్రంప్‌పై వ్యతిరేకతను తన ముద్దుమాటలతో వ్యక్తీకరించి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ చిన్నారి పేరు సోఫీ క్రూజ్. ఈ చిన్నారి ప్రసంగం వింటున్న వారి గుండెలను నేరుగా తాకుతోంది. అందుకే, ఆ బాలిక ప్రసంగం అటు సోషల్ మీడియాలో.. ఇటు ప్రపంచ మీడియాలో ఇంకా మార్మోగిపోతోంది. దాదాపుగా ట్రంప్‌ను వ్యతిరేకించేవారంతా సోపీ క్రూజ్ పేరును గూగుల్‌లో, యూట్యూబ్‌లో వెదుకుతున్నారు. తూటాల్లాంటి ఆ మాటలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇంతకీ సోఫీ ఏమందంటే..? ‘మన కుటుంబాలను రక్షించుకునేందుకు ప్రేమతో అందరం దగ్గరయ్యాం. మన కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మనమంతా సమష్టిగా పోరాడుదాం.. పిల్లలెవరూ ఆందోళన చెందవద్దు. మనం ఒంటరివాళ్లం కాదు.. గుండెల నిండాప్రేమను నింపుకొన్న చాలామంది వ్యక్తులు మనతోనే ఉన్నారు. ఆ దేవుడు కూడా మనవైపే ఉన్నాడు. అందుకే, మనహక్కుల కోసం కలిసికట్టుగా పోరాడుదాం.. అంటూ ఆ చిన్నారి ఇచ్చిన ప్రసంగం చాలామందిని ఆలోచింపజేస్తోంది. సోఫీ గతంలోనూ ఓ సారి మీడియా ముందుకు వచ్చింది. మెక్సికోకు చెందిన సోఫీ గతేడాది శరణార్థుల తరఫున గళమెత్తి అమెరికా దృష్టిని ఆకర్షించింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కూడా కలుసుకుంది. శరణార్థుల తరఫున పోరాడిన వారికి ఇచ్చే ‘డిఫైన్ అమెరికన్’ పురస్కారాన్ని సైతం అందుకుంది. -
'అమ్మా నాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది'
అమాయకమైన మోము.. రెండు చిట్టి జడలు... కళ్లలో పట్టుదల... ప్రపంచానికి చాటి చెప్పాలనే తపన.. అత్యంత శత్రు దుర్భేద్యమైన సెక్యూరిటీ ఉన్నా వెరవలేదు...బెదరలేదు. తనకన్నా ఎత్తు ఉన్న బారికేడ్లను దూకేసింది ఐదు సంవత్సరాల సోఫీ క్రూజ్! నిన్నటివరకు ప్రపంచానికి సోఫీ క్రూజ్ ఎవరో తెలియదు.. కానీ ఈరోజు ప్రపంచంలోని అన్ని ప్రధాన చానళ్లలో, పేపర్లలో, సోఫీ సాహసం కథలు కథలుగా కనిపిస్తోంది.. వినిపిస్తోంది. ఇంతకీ ఎవరీ సోఫీ క్రూజ్.. మెక్సికో నుంచి 'అక్రమంగా' అమెరికాకు వలస వచ్చిన శరణార్థి రౌల్ క్రూజ్ కూతురు. కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ డీసీకి తనవారితో కలిసివచ్చింది. కనీసం 'ఆయన' దృష్టికైనా శరణార్ధుల సమస్యను తీసుకెళితే పరిష్కారం వస్తుందని. ఎవరికి దృష్టికని సందేహమా?.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది క్యాథలిక్కుల గురువు పోప్ ఫ్రాన్సిస్. పోప్ ఫ్రాన్సిస్ మొదటి అమెరికా పర్యటన. కట్టుదిట్టమైన భద్రత. పోప్ కాన్వాయ్ వాషింగ్టన్ వీధుల గుండా సాగుతోంది. దారి పొడవునా నిలబడ్డ వేలాది మంది పోప్‌ను దర్శించుకోవాలని ఆరాటం... కేకలు.. అరుపులు.. భక్తి పారవశ్యం.. ఇంతలో కలకలం.. బారికేడ్‌ను దాటుకొని చేతిలో కలర్ క్రేయాన్స్‌తో పరుగెత్తింది సోఫీ. ఆమెను అడ్డుకున్న సెక్యూరిటీ.. పోప్ దృష్టిని ఆకర్షించడంతో సోఫీ సక్సెస్. పోప్ ...సెక్యూరిటీని వారించి దగ్గరగా పిలిచుకొని దీవించాడు. ప్రజల కేరింతల మధ్య.. అసలు ఆ లెటర్లో సోఫీ ఏం రాసింది.. "పోప్ ఫ్రాన్సిస్.... నేను మీకొక విషయం చెప్పదలచుకున్నాను. నా హృదయం భారంగా, బాధతో ఉంది. నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను. మీరు అధ్యక్షుడితో.. కాంగ్రెస్‌తో మాట్లాడండి.. మా అమ్మానాన్నలు ఇక్కడ ఉండేందుకు అనుమతి ఇవ్వమని అడగండి.. మా అమ్మానాన్నలను నా నుంచి దూరం చేస్తారేమో అనే భయం నన్ను నిత్యం వెంటాడుతోంది" ఒక్కసారిగా సోఫీ ప్రంపంచం దృష్టిని ఆకర్షించింది. అక్రమ వలసదారుల సమస్యను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. సోఫీ అమెరికాలో పుట్టింది కాబట్టి ఇబ్బంది లేదు. సమస్యల్లా ఆమె అమ్మా నాన్నలదే. తర్వాత మీడియా ఇంటర్వ్యూల్లో కూడా సోఫీ మౌలికమైన ప్రశ్నలనే లేవనెత్తింది. ' మా అమ్మానాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది. నేను సంతోషంగా జీవించే హక్కు కూడా నాకు ఉంది' అని మరీ చెప్పింది. తన కూతురు చేసిన పనికి తనకు గర్వంగా సంతోషంగా ఉందని రౌల్ పొంగిపోతున్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఈ విషయమై స్పందిస్తారని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ఇపుడు సోఫీ క్రూజ్ ఐదేళ్ల బుడి బుడి నడకల అమాయకమైన అమ్మాయి... ఒక సమస్యకు 'బ్రాండ్ అంబాసిడర్' కదా.. హాట్సాఫ్ సోఫీ క్రూజ్! ఎస్.గోపీనాథ్ రెడ్డి