మాటలు కావవి తూటాలు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతల స్వీకరణపై అమెరికాలో భారీ నిరసనలు జరిగాయి. పాప్‌సింగర్ మడోన్నా శ్వేతసౌధాన్ని పేల్చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సెలెబ్రిటీ కాబట్టి సహజంగానే ఆమె మాటలు ప్రకంపనలు రేపాయి. ఎలాంటి సెలెబ్రిటీ కాకున్నా.. ఓ ఆరేళ్ల చిన్నారి ట్రంప్‌పై వ్యతిరేకతను తన ముద్దుమాటలతో వ్యక్తీకరించి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ చిన్నారి పేరు సోఫీ క్రూజ్. ఈ చిన్నారి ప్రసంగం వింటున్న వారి గుండెలను నేరుగా తాకుతోంది. అందుకే, ఆ బాలిక ప్రసంగం అటు సోషల్ మీడియాలో.. ఇటు ప్రపంచ మీడియాలో ఇంకా మార్మోగిపోతోంది. దాదాపుగా ట్రంప్‌ను వ్యతిరేకించేవారంతా సోపీ క్రూజ్ పేరును గూగుల్‌లో, యూట్యూబ్‌లో వెదుకుతున్నారు. తూటాల్లాంటి ఆ మాటలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇంతకీ సోఫీ ఏమందంటే..?
‘మన కుటుంబాలను రక్షించుకునేందుకు ప్రేమతో అందరం దగ్గరయ్యాం. మన కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మనమంతా సమష్టిగా పోరాడుదాం.. పిల్లలెవరూ ఆందోళన చెందవద్దు. మనం ఒంటరివాళ్లం కాదు.. గుండెల నిండాప్రేమను నింపుకొన్న చాలామంది వ్యక్తులు మనతోనే ఉన్నారు. ఆ దేవుడు కూడా మనవైపే ఉన్నాడు. అందుకే, మనహక్కుల కోసం కలిసికట్టుగా పోరాడుదాం.. అంటూ ఆ చిన్నారి ఇచ్చిన ప్రసంగం చాలామందిని ఆలోచింపజేస్తోంది. సోఫీ గతంలోనూ ఓ సారి మీడియా ముందుకు వచ్చింది. మెక్సికోకు చెందిన సోఫీ గతేడాది శరణార్థుల తరఫున గళమెత్తి అమెరికా దృష్టిని ఆకర్షించింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కూడా కలుసుకుంది. శరణార్థుల తరఫున పోరాడిన వారికి ఇచ్చే ‘డిఫైన్ అమెరికన్’ పురస్కారాన్ని సైతం అందుకుంది.