'అమ్మా నాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది' | 5 year old sophie cruz gives letter to pope francis about her parents | Sakshi
Sakshi News home page

'అమ్మా నాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది'

Published Fri, Sep 25 2015 2:37 PM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

'అమ్మా నాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది'

'అమ్మా నాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది'

అమాయకమైన మోము.. రెండు చిట్టి జడలు... కళ్లలో పట్టుదల... ప్రపంచానికి చాటి చెప్పాలనే తపన.. అత్యంత శత్రు దుర్భేద్యమైన సెక్యూరిటీ ఉన్నా వెరవలేదు...బెదరలేదు. తనకన్నా ఎత్తు ఉన్న బారికేడ్లను దూకేసింది ఐదు సంవత్సరాల సోఫీ క్రూజ్! నిన్నటివరకు ప్రపంచానికి సోఫీ క్రూజ్ ఎవరో తెలియదు.. కానీ ఈరోజు ప్రపంచంలోని అన్ని ప్రధాన చానళ్లలో, పేపర్లలో, సోఫీ సాహసం  కథలు కథలుగా కనిపిస్తోంది.. వినిపిస్తోంది.

ఇంతకీ ఎవరీ సోఫీ క్రూజ్.. మెక్సికో నుంచి 'అక్రమంగా' అమెరికాకు వలస వచ్చిన శరణార్థి రౌల్ క్రూజ్  కూతురు. కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ డీసీకి తనవారితో కలిసివచ్చింది. కనీసం 'ఆయన' దృష్టికైనా శరణార్ధుల సమస్యను తీసుకెళితే పరిష్కారం వస్తుందని. ఎవరికి దృష్టికని సందేహమా?.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది క్యాథలిక్కుల గురువు పోప్ ఫ్రాన్సిస్.

పోప్ ఫ్రాన్సిస్ మొదటి అమెరికా పర్యటన. కట్టుదిట్టమైన భద్రత. పోప్ కాన్వాయ్ వాషింగ్టన్ వీధుల గుండా సాగుతోంది. దారి పొడవునా నిలబడ్డ వేలాది మంది పోప్ను దర్శించుకోవాలని ఆరాటం... కేకలు.. అరుపులు.. భక్తి పారవశ్యం.. ఇంతలో కలకలం.. బారికేడ్ను దాటుకొని చేతిలో కలర్ క్రేయాన్స్తో పరుగెత్తింది సోఫీ. ఆమెను అడ్డుకున్న సెక్యూరిటీ.. పోప్ దృష్టిని ఆకర్షించడంతో సోఫీ సక్సెస్.

పోప్ ...సెక్యూరిటీని వారించి దగ్గరగా పిలిచుకొని దీవించాడు. ప్రజల కేరింతల మధ్య.. అసలు ఆ లెటర్లో సోఫీ ఏం రాసింది.. "పోప్ ఫ్రాన్సిస్.... నేను మీకొక విషయం చెప్పదలచుకున్నాను. నా హృదయం భారంగా, బాధతో ఉంది. నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను. మీరు అధ్యక్షుడితో.. కాంగ్రెస్తో మాట్లాడండి.. మా  అమ్మానాన్నలు ఇక్కడ ఉండేందుకు అనుమతి ఇవ్వమని అడగండి.. మా అమ్మానాన్నలను నా నుంచి దూరం చేస్తారేమో అనే భయం నన్ను నిత్యం వెంటాడుతోంది"

ఒక్కసారిగా సోఫీ ప్రంపంచం దృష్టిని ఆకర్షించింది. అక్రమ వలసదారుల సమస్యను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. సోఫీ అమెరికాలో పుట్టింది కాబట్టి ఇబ్బంది లేదు. సమస్యల్లా ఆమె అమ్మా నాన్నలదే.

తర్వాత మీడియా ఇంటర్వ్యూల్లో కూడా సోఫీ మౌలికమైన ప్రశ్నలనే లేవనెత్తింది. ' మా  అమ్మానాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది. నేను సంతోషంగా జీవించే హక్కు కూడా నాకు ఉంది' అని మరీ  చెప్పింది.  తన కూతురు చేసిన పనికి తనకు గర్వంగా సంతోషంగా ఉందని రౌల్ పొంగిపోతున్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఈ విషయమై  స్పందిస్తారని  ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ఇపుడు సోఫీ క్రూజ్ ఐదేళ్ల బుడి బుడి నడకల అమాయకమైన అమ్మాయి... ఒక సమస్యకు 'బ్రాండ్ అంబాసిడర్' కదా.. హాట్సాఫ్ సోఫీ క్రూజ్!

ఎస్.గోపీనాథ్ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement