migrants issue
-
పలు దేశాలకు ట్రంప్ వార్నింగ్.. కారణం ఇదే..
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో వలసదారులకు కాబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భయం పట్టుకుంది. అమెరికాలో వలసదారులపై కఠినంగా వ్యవహరించనున్నట్టు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా ట్రంప్ తీసుకుంటున్నారు. ఇక, తాజాగా వలసదారులపై మరో కీలక ప్రకటన చేశారు.డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్న వలసదారులు వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలి. అమెరికాలో ఏయే దేశాల వారైతే ఉన్నారో.. వారిని వెంటనే తమ దేశాలు వెనక్కి పిలిపించుకోవాలి. ఇలా జరగకపోతే.. ఆయా దేశాలతో అమెరికా వ్యాపార సంబంధాలు నిలిపి వేయడం జరుగుతుంది. వలసదారులను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించే దేశాలకు అమెరికా నుంచి ఎలాంటి వ్యాపారాలు, ఎగుమతులు, దిగుమతులు జరగవు. అన్ని వ్యాపారాలను చాలా కష్టతరం చేస్తాం. ఆ దేశాలకు సుంకాలను భారీగా పెంచేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై పలు దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఇదిలా ఉండగా.. కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వలసదారుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. అక్రమ వలదారులు ఎవరున్నా వాళ్ళపై సైనిక చర్యలు తీసుకుంటానని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా చట్టాలను అనుసరించే ఎవరైనా తమ దేశంలో ఉండేలా చూసుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు.ఇక, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్ట్ ట్రంప్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలు దేశాల అధినేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆహ్వానం వెళ్లింది. -
ఇండియన్స్‌పై యూకే మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. భారత్ కౌంటర్!
లండన్: వీసా పరిమితి ముగిసినప్పటికీ బ్రిటన్‌లో ఉంటున్న వారిలో అధికంగా భారతీయులేనని యూకే హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. గత ఏడాది రెండు దేశాల మధ్య జరిగిన మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్షిప్(ఎంఎంపీ) ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని సుయెల్లా పేర్కొనంటపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఒప్పందం కింద లేవనెత్తిన అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించామని లండన్‌లోని భారత హైకమిషన్ స్పష్టం చేసింది. ఒప్పందంలో భాగంగా యూకే వైపు నుంచి సైతం స్పందన కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపింది. యూకే హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై ప్రశ్నించగా.. పలు విషయాలను వెల్లడించింది లండన్‌లోని భారత హైకమిషన్. ‘మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ఒప్పందంలో భాగంగా వీసా పరిమితి ముగిసిన తర్వాత బ్రిటన్‌లో ఉంటున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు యూకేతో కలిసి పని చేసేందుకు కట్టుబడి ఉన్నాం. హోంశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించాం. ఎంఎంపీ ఒప్పందంలో భాగంగా హామీలను నెరవేర్చేందుకు యూకే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే వాటిలో సరైన పురోగతి కోసం తాము వేచి చూస్తున్నాం.’ అని లండన్‌లోని భారత హైకమిషన్ బదులిచ్చింది. మరోవైపు.. ఇరు దేశాల మధ్య చర్చల్లో ఉన్న ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై వీసా సంబంధిత రిజర్వేషన్లపైనా సుయెల్లా వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. భారత్‌తో ఎఫ్‌టీఏపై ఆందోళనలున్నట్లు పేర్కొన్నారు. దీనిపై భారత హైకమిషన్ స్పందిస్తూ.. ‘మొబిలిటీ, మైగ్రేషన్‌కు సంబంధించిన విషయాలపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. ఈ సమయంలో వాటి గురించి వ్యాఖ్యలు సమంజసం కాదు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందమైనా ఇరుదేశాలకు ప్రయోజనకరంగా ఉండాలి.’ అని పేర్కొంది. మరోవైపు.. యూకే మంత్రి వ్యాఖ్యలతో ఎఫ్‌టీఏలో భారతీయులకు వీసా రాయితీలకు మంత్రివర్గం మద్దతును నిలిపివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: రష్యా, ఉక్రెయిన్ ‘హక్కుల’ గ్రూప్‌లకు నోబెల్ శాంతి బహుమతి -
‘గల్ఫ్ కార్మికుల చెమట చుక్కల ద్వారా సంపాదించిన సొమ్మే అధికం’
ఎర్రటి ఎండలో.. తమ రక్తాన్ని మరిగించి చెమటను చిందిస్తున్న గల్ఫ్ కార్మికులు ఒక్కొక్క చెమట చుక్క ఒక్క రూపాయి లాగా సంపాదించి పంపిన విదేశీ మారక ద్రవ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పవృక్షం, కామధేనువు లాగా లాభం చేకూరుస్తుంది. అయితే కార్మికులు మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలకు నోచుకోకుండా వారి బతుకులు ఎండమావులు అవుతున్నాయని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలోని వోక్సెన్ యూనివర్సిటీ గురువారం తెలంగాణ గల్ఫ్ వలసలపై జాతీయ వర్చువల్ సింపోజియం (ఆన్ లైన్ చర్చ) నిర్వహించింది. పబ్లిక్ పాలసీ రీసెర్చ్, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగం ఈ చర్చను నిర్వహించింది. ఈ చర్చలో ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి మాట్లాడారు. గత సంవత్సరం (2021-22) లో ప్రవాస భారతీయులు నుంచి 89 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) భారతదేశం పొందింది. ఇది దేశ జిడిపి (స్థూల దేశీయ ఉత్పత్తి) లో 3 శాతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైల జనాభా 2 కోట్ల యాభై లక్షలు. ఇందులో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసించే 88 లక్షల మంది భారతీయ కార్మికుల చెమట చుక్కల ద్వారా సంపాదించిన సొమ్మే అధికం. ఎన్నారైలు పంపే విదేశీ మారక ద్రవ్యంతో దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఉపయోగపడుతుంది. భారత ప్రభుత్వం వద్ద విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగ్గుతున్నట్లు ఇటీవలి నివేదికలు తెలుపుతున్నాయి. ఫారెక్స్ నిల్వలు 2 సంవత్సరాల కనిష్ట స్థాయి 564 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. రూపాయి విలువ అధఃపాతాళానికి జారిపోయింది. భారత ప్రభుత్వం పేద కార్మికులను విదేశాలకు పంపుతూ ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేస్తున్నది. ఎలాంటి ఖర్చు లేకుండా మానవ వనరులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న భారత ప్రభుత్వం ప్రవాసులు పంపే సొమ్ముతో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నది. ప్రభుత్వాలకు ఎన్నారైల పెట్టుబడులు, వారు ఇచ్చే విరాళాలపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదు. ప్రవాస కార్మికుల బతుకులు మారడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ బడ్జెట్ ను కేటాయించడం లేదు. ఒంటరి వలసలు, తక్కువ చదువు, తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం కలిగిన కార్మికులు అన్యాయానికి గురవుతున్నారు. ఆన్ లైన్ మీటింగ్ లో పాల్గొన్న మంద భీంరెడ్డి వారు పొట్టచేత పట్టుకొని సప్త సముద్రాలు, భారత సరిహద్దులు దాటి.. ఎడారి దేశాలలో పనిచేసే తెలంగాణ వలస కార్మికులు. తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్మును స్వదేశానికి విదేశీ మారక ద్రవ్యం రూపంలో పంపిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక జవాన్లుగా, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలోపేతంలో భాగస్వాములుగా తమ వంతు సేవ చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికుల లాగా వీరు కూడా కుటుంబాలను వదిలి దూర తీరాలకు వెళ్లి మాతృభూమి రుణం తీర్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 15 లక్షల మంది వలసదారులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారని ఒక అంచనా. ఒక కార్మికుడు, ఉద్యోగి సరాసరి నెలకు 700 యుఎఇ దిర్హామ్స్ / సౌదీ రియాల్స్ (లేదా సమానమైన గల్ఫ్ కరెన్సీలు) పంపితే అది రూ . 14,000 కు సమానం. 15 లక్షల మంది గల్ఫ్ ప్రవాసులు నెలకు రూ. 14 వేలు పంపిస్తే రూ. 2,100 కోట్లు అవుతుంది. సంవత్సరానికి రూ. 25,200 కోట్లు అవుతుంది. తెలంగాణ గల్ఫ్ ప్రవాసులు పంపే రూ. 25,200 కోట్లు విదేశీ మారక ద్రవ్యం వారి కుటుంబ సభ్యుల ద్వారా దేశీయంగా వినియోగంలోకి వచ్చినప్పుడు కనీసం 10 శాతం జీఎస్టీ సంవత్సరానికి రూ.2,520 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన సగం వాటా కింద సంవత్సరానికి రూ. 1,260 కోట్లు లాభపడుతున్నది. ఎక్స్ పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్స్ స్కీం (ఎగుమతి ఆధారిత యూనిట్ల పథకం) 1981లో ప్రవేశపెట్టబడింది. ఎగుమతులను పెంచడం, దేశంలో విదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని పెంచడం మరియు భారతదేశంలో అదనపు ఉపాధిని సృష్టించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం భూమి, నీరు, విద్యుత్, బ్యాంకు రుణాలు, పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపులు అందిస్తుంది. గల్ఫ్ రిక్రూట్మెంట్ వ్యవస్థకు ఇండస్ట్రీ స్టేటస్ (పరిశ్రమల హోదా) ఇవ్వాలి. ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి. మెడికల్ టెస్ట్ ఫ్లయిట్ టికెట్, నైపుణ్య శిక్షణ లాంటి వాటికి ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వాలి. గల్ఫ్ దేశాలకు కార్మికులను భర్తీ చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు లేదా 45 రోజుల జీతాన్ని ఫీజుగా తీసుకోవడానికి రిక్రూటింగ్ ఏజెన్సీలకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రిక్రూట్మెంట్ ఫీజు లేకుండా ఉచితంగా ఉద్యోగ భర్తీ చేపట్టాలనే సంకల్పానికి ప్రభుత్వాల మద్దతు అవసరం. కార్మికులను విదేశాలకు పంపే అతిపెద్ద దేశమైన భారత్‌కు ఒక మైగ్రేషన్ పాలసీ (వలస విధానం) లేకపోవడం విచారకరం అని మంద భీంరెడ్డి అన్నారు. డా. జునుగురు శ్రీనివాస్, డా. రౌల్ వి. రోడ్రిగ్జ్, డా. జె. సంతోష్, డా. నరేష్ సుదవేని, డా. పి. వి. సత్య ప్రసాద్, వలస కార్మికుల ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షకుడు బి. ఎల్. సురేంద్రనాథ్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. -
గుజరాత్లో ‘ఏకత్వం’ చిన్నాభిన్నం
సాక్షి, న్యూఢిల్లీ : ‘భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్’ ఇక పాత మాటేనా! హిందీ మాట్లాడే వలసవాదులపై దాడులతో గుజరాత్ రగిలిపోతోంది. దాడులను ఎదుర్కోలేక బిహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ వలసకార్మికులు తట్టా బుట్టా సర్దుకొని పారిపోతున్నారు. సబర్కాంత జిల్లాలో సెప్టెంబర్ 28వ తేదీన ఓ 14 ఏళ్ల బాలికను ఓ బిహారి రేప్ చేశారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో బిహారీలకు వ్యతిరేకంగా ఒక్కసారి హింసాకాండ ప్రజ్వరిల్లింది. ఆ హింసాకాండ అనతికాలంలోనే హిందీ మాట్లాడే యూపీ, మధ్యప్రదేశ్ వలసకార్మికులపైకి మళ్లింది. అంతే సబర్కాంత, గాంధీనగర్, అహ్మదాబాద్, పఠాన్, మెహసాన జిల్లాలకు హింసాకాండ విస్తరించింది. (చదవండి: దాడులను ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ పార్టీనే) ఎప్పటిలాగే ఈ అల్లర్లలో కూడా సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించింది. పోషిస్తోంది. వలస కార్మికులను లక్ష్యంగా పెట్టుకొని దాడులు చేస్తున్న వీడియో దృశ్యాలను విపరీతంగా షేర్ చేస్తోంది. దాడులను రెచ్చగొడుతోంది. పరిస్థితి సమీక్షించి ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాలని, చిన్నాభిన్నం అవుతున్న భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవడం ఎలా? అన్నది ఆలోచించాల్సిన రాజకీయ నాయకులు పరస్పరం బురద చల్లుకుంటున్నారు. బిహార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూస్తున్న గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు అల్పేష్ ఠాకూర్‌ను బీజేపీ, జెడీయూ పార్టీలు అనవసరంగా నిందిస్తున్నాయి. బిహార్‌లో అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అల్పేష్ ఠాకూర్‌ను బీజేపీ నాయకుడు సమ్రాట్ చౌధరి హెచ్చరించారు. (చదవండి: హింసాత్మక చర్యలకు పాల్పడకండి) భారత్‌లో వలసలనేవి సర్వసాధారణం. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహా నగరాలు తమ అభివృద్ధి పథంలో వలసలకు ఆశ్రయమిస్తున్నాయి. మరోపక్క పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు కూడా వలసలకు ఊతమిచ్చాయి. మహారాష్ట్రలో, కర్ణాటకలో బిహార్, యూపీ వలసదారులకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా రాజకీయ నాయకులు మాట్లాడడం అప్పుడప్పుడు వింటుంటాం. మహారాష్ట్రలో అడపాదడపా బిహార్, యూపీ వలసదారులకు వ్యతిరేకంగా దాడులు కూడా జరుగుతాయి. గుజరాత్లో రాజకీయ నాయకులు వలసల గురించి ఎన్నడూ మాట్లాడలేదు. ఇదే మొదటి సారి. ఉత్తరాది నుంచే వలసలు 1980 దశకంలో ఉత్తర భారత్ నుంచి వలసలు బయల్దేరాయి. రాష్ట్రాల మధ్య వలసలు 1991–2001 దశాబ్దంలో మోస్తారుగా పెరిగాయి. 2001–2011 దశాబ్దంలో ఆ వలసలు రెండింతలు దాటాయి. బాగా వెనకబడిన ఉత్తర ప్రదేశ్ నుంచి వలసలు రెండింతలు పెరగ్గా, బిహార్ నుంచి 2.3 రెట్లు పెరిగాయి. భిన్న మతాల వారు, భిన్న భాషీయులు, భిన్న సంస్కృతుల ప్రజలు కలిసుండే భారత్‌ను విదేశీయులు ప్రశంసిస్తుండగా, మాది భిన్నత్వంలో ఏకత్వం అంటూ మురిసిపోయే వాళ్లం. ఇప్పుడు ఆ మురిపాలు కాస్త నగుపాలయ్యే ప్రమాదం ఏర్పడింది. -
'అమ్మా నాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది'
అమాయకమైన మోము.. రెండు చిట్టి జడలు... కళ్లలో పట్టుదల... ప్రపంచానికి చాటి చెప్పాలనే తపన.. అత్యంత శత్రు దుర్భేద్యమైన సెక్యూరిటీ ఉన్నా వెరవలేదు...బెదరలేదు. తనకన్నా ఎత్తు ఉన్న బారికేడ్లను దూకేసింది ఐదు సంవత్సరాల సోఫీ క్రూజ్! నిన్నటివరకు ప్రపంచానికి సోఫీ క్రూజ్ ఎవరో తెలియదు.. కానీ ఈరోజు ప్రపంచంలోని అన్ని ప్రధాన చానళ్లలో, పేపర్లలో, సోఫీ సాహసం కథలు కథలుగా కనిపిస్తోంది.. వినిపిస్తోంది. ఇంతకీ ఎవరీ సోఫీ క్రూజ్.. మెక్సికో నుంచి 'అక్రమంగా' అమెరికాకు వలస వచ్చిన శరణార్థి రౌల్ క్రూజ్ కూతురు. కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ డీసీకి తనవారితో కలిసివచ్చింది. కనీసం 'ఆయన' దృష్టికైనా శరణార్ధుల సమస్యను తీసుకెళితే పరిష్కారం వస్తుందని. ఎవరికి దృష్టికని సందేహమా?.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది క్యాథలిక్కుల గురువు పోప్ ఫ్రాన్సిస్. పోప్ ఫ్రాన్సిస్ మొదటి అమెరికా పర్యటన. కట్టుదిట్టమైన భద్రత. పోప్ కాన్వాయ్ వాషింగ్టన్ వీధుల గుండా సాగుతోంది. దారి పొడవునా నిలబడ్డ వేలాది మంది పోప్‌ను దర్శించుకోవాలని ఆరాటం... కేకలు.. అరుపులు.. భక్తి పారవశ్యం.. ఇంతలో కలకలం.. బారికేడ్‌ను దాటుకొని చేతిలో కలర్ క్రేయాన్స్‌తో పరుగెత్తింది సోఫీ. ఆమెను అడ్డుకున్న సెక్యూరిటీ.. పోప్ దృష్టిని ఆకర్షించడంతో సోఫీ సక్సెస్. పోప్ ...సెక్యూరిటీని వారించి దగ్గరగా పిలిచుకొని దీవించాడు. ప్రజల కేరింతల మధ్య.. అసలు ఆ లెటర్లో సోఫీ ఏం రాసింది.. "పోప్ ఫ్రాన్సిస్.... నేను మీకొక విషయం చెప్పదలచుకున్నాను. నా హృదయం భారంగా, బాధతో ఉంది. నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను. మీరు అధ్యక్షుడితో.. కాంగ్రెస్‌తో మాట్లాడండి.. మా అమ్మానాన్నలు ఇక్కడ ఉండేందుకు అనుమతి ఇవ్వమని అడగండి.. మా అమ్మానాన్నలను నా నుంచి దూరం చేస్తారేమో అనే భయం నన్ను నిత్యం వెంటాడుతోంది" ఒక్కసారిగా సోఫీ ప్రంపంచం దృష్టిని ఆకర్షించింది. అక్రమ వలసదారుల సమస్యను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. సోఫీ అమెరికాలో పుట్టింది కాబట్టి ఇబ్బంది లేదు. సమస్యల్లా ఆమె అమ్మా నాన్నలదే. తర్వాత మీడియా ఇంటర్వ్యూల్లో కూడా సోఫీ మౌలికమైన ప్రశ్నలనే లేవనెత్తింది. ' మా అమ్మానాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది. నేను సంతోషంగా జీవించే హక్కు కూడా నాకు ఉంది' అని మరీ చెప్పింది. తన కూతురు చేసిన పనికి తనకు గర్వంగా సంతోషంగా ఉందని రౌల్ పొంగిపోతున్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఈ విషయమై స్పందిస్తారని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ఇపుడు సోఫీ క్రూజ్ ఐదేళ్ల బుడి బుడి నడకల అమాయకమైన అమ్మాయి... ఒక సమస్యకు 'బ్రాండ్ అంబాసిడర్' కదా.. హాట్సాఫ్ సోఫీ క్రూజ్! ఎస్.గోపీనాథ్ రెడ్డి