సాక్షి, న్యూఢిల్లీ : ‘భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్’ ఇక పాత మాటేనా! హిందీ మాట్లాడే వలసవాదులపై దాడులతో గుజరాత్ రగిలిపోతోంది. దాడులను ఎదుర్కోలేక బిహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ వలసకార్మికులు తట్టా బుట్టా సర్దుకొని పారిపోతున్నారు. సబర్‌కాంత జిల్లాలో సెప్టెంబర్ 28వ తేదీన ఓ 14 ఏళ్ల బాలికను ఓ బిహారి రేప్ చేశారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో బిహారీలకు వ్యతిరేకంగా ఒక్కసారి హింసాకాండ ప్రజ్వరిల్లింది. ఆ హింసాకాండ అనతికాలంలోనే హిందీ మాట్లాడే యూపీ, మధ్యప్రదేశ్ వలసకార్మికులపైకి మళ్లింది. అంతే సబర్‌కాంత, గాంధీనగర్, అహ్మదాబాద్, పఠాన్, మెహసాన జిల్లాలకు హింసాకాండ విస్తరించింది. (చదవండి: దాడులను ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ పార్టీనే)
ఎప్పటిలాగే ఈ అల్లర్లలో కూడా సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించింది. పోషిస్తోంది. వలస కార్మికులను లక్ష్యంగా పెట్టుకొని దాడులు చేస్తున్న వీడియో దృశ్యాలను విపరీతంగా షేర్ చేస్తోంది. దాడులను రెచ్చగొడుతోంది. పరిస్థితి సమీక్షించి ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాలని, చిన్నాభిన్నం అవుతున్న భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవడం ఎలా? అన్నది ఆలోచించాల్సిన రాజకీయ నాయకులు పరస్పరం బురద చల్లుకుంటున్నారు. బిహార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూస్తున్న గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు అల్పేష్ ఠాకూర్‌ను బీజేపీ, జెడీయూ పార్టీలు అనవసరంగా నిందిస్తున్నాయి. బిహార్‌లో అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అల్పేష్ ఠాకూర్‌ను బీజేపీ నాయకుడు సమ్రాట్ చౌధరి హెచ్చరించారు. (చదవండి: హింసాత్మక చర్యలకు పాల్పడకండి)
భారత్‌లో వలసలనేవి సర్వసాధారణం. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహా నగరాలు తమ అభివృద్ధి పథంలో వలసలకు ఆశ్రయమిస్తున్నాయి. మరోపక్క పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు కూడా వలసలకు ఊతమిచ్చాయి. మహారాష్ట్రలో, కర్ణాటకలో బిహార్, యూపీ వలసదారులకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా రాజకీయ నాయకులు మాట్లాడడం అప్పుడప్పుడు వింటుంటాం. మహారాష్ట్రలో అడపాదడపా బిహార్, యూపీ వలసదారులకు వ్యతిరేకంగా దాడులు కూడా జరుగుతాయి. గుజరాత్‌లో రాజకీయ నాయకులు వలసల గురించి ఎన్నడూ మాట్లాడలేదు. ఇదే మొదటి సారి.
ఉత్తరాది నుంచే వలసలు
1980 దశకంలో ఉత్తర భారత్ నుంచి వలసలు బయల్దేరాయి. రాష్ట్రాల మధ్య వలసలు 1991–2001 దశాబ్దంలో మోస్తారుగా పెరిగాయి. 2001–2011 దశాబ్దంలో ఆ వలసలు రెండింతలు దాటాయి. బాగా వెనకబడిన ఉత్తర ప్రదేశ్ నుంచి వలసలు రెండింతలు పెరగ్గా, బిహార్ నుంచి 2.3 రెట్లు పెరిగాయి. భిన్న మతాల వారు, భిన్న భాషీయులు, భిన్న సంస్కృతుల ప్రజలు కలిసుండే భారత్‌ను విదేశీయులు ప్రశంసిస్తుండగా, మాది భిన్నత్వంలో ఏకత్వం అంటూ మురిసిపోయే వాళ్లం. ఇప్పుడు ఆ మురిపాలు కాస్త నగుపాలయ్యే ప్రమాదం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment