ఇద్దరు మహిళల తలనరికిన ఐఎస్ఐఎస్
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. సిరియాలో 'చేతబడి' ఆరోపణలతో ఇద్దరు మహిళల తలలు నరికారు. సిరియాలో ఈ తరహా దారుణం జరగడం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని సిరియా మానవహక్కుల పరిశీలన సంఘం తెలిపింది. డైర్ ఎజోర్ రాష్ట్రంలో వారిద్దరినీ తలలు నరికారని సంఘం చీఫ్ రమీ అబ్దెల్ రహమాన్ తెలిపారు. నరికివేతకు గురైన మహిళలిద్దరూ వివాహితులే. వాళ్ల భర్తలతో కలిపి మరీ వాళ్లను చంపారు.
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో కొంతమంది మహిళలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రాళ్లతో కొట్టి చంపారు. అయితే.. ఇలా తల నరికి చంపడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ ఏడాది సిరియాలో ఇప్పటివరకు దాదాపు 3 వేల మందికి పైగా వ్యక్తులను ఇస్లామిక్ స్టేట్ హతమార్చింది. వాళ్లలో 74 మంది పిల్లలు కూడా ఉన్నారు.