మంత్రికి ట్వీట్ చేస్తే.. ప్రాణాలు కాపాడారు!
సామాన్య పౌరులు మంత్రులకు ఏమైనా సమస్య చెబితే అది పరిష్కారం అవుతుందా? అది కూడా కేంద్ర మంత్రులైతే అసలు పట్టించుకుంటారా? సాధారణంగా అయితే దీనికి నో అనే సమాధానం వస్తుంది. కానీ రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు మాత్రం అలా వదిలేసే రకం కాదు. విషయం తన దృష్టికి ఎలా వచ్చినా వెంటనే స్పందించి, తక్షణం పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ సంఘటన.
శంకర్ పండిట్.. బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బిహార్లోని కియుల్ ప్రాంతంలో తన మామగారి ఇంటికి భార్య, రెండేళ్ల కూతురితో సహా వెళ్లి తిరిగి బెంగళూరు వస్తున్నాడు. వాళ్లు అంగ ఎక్స్ప్రెస్ ఎక్కారు. రైలు బయల్దేరిన కొద్దిసేపటికే శంకర్ కూతురికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. తోటి ప్రయాణికులు సాయం చేద్దామనుకున్నా.. ఎవరికీ ఏం చేయాలో తెలియదు. శంకర్ సహా ఎవరిదగ్గరా మందులు కూడా లేవు. పోనీ మధ్యలో దిగిపోదామంటే, దగ్గర్లో ఆస్పత్రి ఉందో లేదో తెలియదు. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో @RailMinIndia అనే ట్విట్టర్ ఐడీకి కాపాడమంటూ ట్వీట్ చేశారు. సరిగ్గా రెండు నిమిషాల్లో రైల్వే మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఆ నిమిషం నుంచి వరుసపెట్టి రైల్వే అధికారులు ఫోన్ల మీద ఫోన్లు చేశారు. ఎక్కడున్నారు, సమస్య ఏంటి, ఇతర వివరాలన్నీ అడిగారు. అక్కడకు దగ్గర్లో ఉన్న అసన్సాల్ స్టేషన్ వద్ద పూర్తిస్థాయి వైద్యబృందంతో కూడిన అంబులెన్సు సిద్ధంగా ఉంది.
విషయం ఏమిటంటే, ట్వీట్ చూసిన వెంటనే సురేష్ ప్రభు.. కోల్కతాలోని తూర్పు రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. ఆ పాపకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. అప్పటికే పాప పరిస్థితి కొంత విషమంగా ఉంది. ఆమెను రైల్వే ఆస్పత్రిలో చేర్చి.. వెంటనే చికిత్స చేయడంతో.. కోలుకుంది. ఇక ఆ తల్లిదండ్రుల ఆనందానికి అంతులేదు. కళ్ల ముందే తోటకూర కాడలా వడిలిపోతున్న కూతురిని చూసి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను.. ఏదో వీఐపీలను చూసినట్లు చూసి, ఆదుకున్నారని పొంగిపోతున్నారు. పాపకు నయమైన తర్వాత రైల్వే అధికారులు అసనాల్ స్టేషన్ నుంచి బెంగళూరుకు కూడా టికెట్లు కన్ఫర్మ్ చేయించి వాళ్లను సురక్షితంగా పంపారు. నిజంగా ప్రజాప్రతినిధులు అందరూ ఇలా స్పందిస్తే.. ఇక ప్రజలకు సమస్యలు అన్నవే ఉండవు కదూ.