'మీరు ఇప్పుడు వెళ్లకుంటే కాల్చేస్తా.. బాంబులేస్తా'
బుర్ద్వాన్: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యువనేత ఒకరు రెచ్చిపోయాడు. ఆందోళన విరమించుకోండని సూచించేందుకు వచ్చిన పోలీసులపై ఒంటికాలిపై లేచాడు. 'వెంటనే వెళ్లిపోండి లేదంటే.. పోలీస్ స్టేషన్ పేల్చేస్తా.. జీపును కాల్చేస్తా' అంటూ బెదిరించాడు. దీంతో పోలీసులు ఇక చేసేదేం లేక తమ పని తాము చేసుకుపోయారు. తమను బెదిరించిన ఆ నాయకుడిని అరెస్టు చేసి జైలులో వేశారు. సౌమిత్రా బెనర్జీ అనే వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాణిగంజ్ బ్లాక్‌కు అధ్యక్షుడుగా ఉన్నాడు. దీంతోపాటు ఓ స్టూడెంట్ యూనియన్‌లో కూడా సభ్యుడు.
త్రివేణి దేవి భలోటియా అనే కాలేజీలో ప్రవేశాలకు సంబంధించి అతడు కొంతమంది విద్యార్థులతో కలిసి ప్రిన్సిపాల్ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగాడు. ఈ సందర్భంగా అక్కడికి పోలీసులు రావడంతో విద్యార్థులు వెనక్కి తగ్గేందుకు ప్రయత్నించారు. దీంతో వారినుద్దేశించి 'పోలీసులను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేయలేరు. వాళ్లు ప్రభుత్వానికి సేవకులు' అని అన్నాడు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన పోలీసులను వెళ్లిపోండండని మండిపడుతూ ఇంకోసారి కాలేజీ కాంపౌండ్‌లో ఐదు నిమిషాల్లో తిరుగు మొఖం పెట్టకుంటే జీపు కాల్చిపారేస్తామని, పోలీస్ స్టేషన్‌పై బాంబేస్తానని బెదిరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.