Soundarya R. Ashwin
-
కొచ్చడయాన్ వాయిదా ఎందుకు?
కొచ్చడయాన్ చిత్రం విడుదల వాయిదా పడటానికి కారణాలేమిటన్న ప్రశ్నకు పలు అంశాలు వ్యక్తం అవుతున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం కొచ్చడయాన్. ఆయన రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపిక పదుకునే హీరోయిన్గా నటించారు. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం పలు విశేషాల నెలవు అని పేర్కొనవచ్చు. ఈ చిత్రాన్ని అవతార్, టిన్టిన్ వంటి హాలీవుడ్ చిత్రాల తరహాలో మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డీ ఫార్మెట్లో రూపొందించాలని దర్శకురాలు సౌందర్య భావించారు. టీవీలో వచ్చే కార్టూన్ చిత్రాల మాదిరిగా కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలనుకున్నారు. అయితే ఆమె ఊహించినట్లుగా ఇదంతా అంత సులభంగా జరగలేదు. చిత్ర బడ్జెట్ తడిసి మోపెడవడంతో చిత్రానికి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మోషన్ క్యాప్చరింగ్‌ను ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోదారి లేకపోవడంతో అలానే చిత్రాన్ని పూర్తి చేశారు. ఇలాంటి పరిస్థితిలో మరో సమస్య వచ్చి పడింది. ఈ చిత్ర నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు పాత బాకీ చెల్లించాల్సి ఉంది. అది సెటిల్ చేస్తేనే కొచ్చడయాన్ చిత్రాన్ని విడుదల చేస్తామని పట్టుపట్టారు. ఈ సమస్య చర్చల ద్వారా ఒక కొలిక్కి రావడంతో చిత్రాన్ని తొమ్మిదో తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైంది. అలాంటి పరిస్థితిలో అనూహ్యంగా కొచ్చడయాన్ చిత్ర విడుదలకు వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీనికి కారణం నిర్మాతల రుణ సమస్య పరిష్కారం కాకపోవడమేనని కోలీవుడ్ టాక్. మరోవైపు ఈ చిత్రాన్ని మే 23వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
చెన్నైలో కొచ్చడయాన్ ఫీవర్, 13 వేల టికెట్లు అమ్మకం!
చెన్నై: చెన్నై నగరానికి 'కొచ్చడయాన్' ఫీవర్ పట్టుకుంది. తమిళనాడులో ఈ చిత్రం విజయవంతం కావాలని అభిమానులు ఆలయాలను దర్శించుకోవడంతోపాటు, భారీ కటౌట్లతో చైన్నైని హోరెత్తిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కొచ్చడయాన్' విడుదలకు ముందు కార్యక్రమాలు పెళ్లి వేడుకలను తలపిస్తున్నాయని పలువురు అంటున్నారు. ఇప్పటికే మల్టిప్లెక్స్ లో 13 వేల టికెట్ల అమ్మకాలు జరిగిపోయాయి. భారత దేశంలో తొలి ఫోటో రియలిస్టిక్ 3D యానిమేటెడ్ మోషన్ కాప్చర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తమిళనాడులో మొత్తం 477 థియేటర్లలో విడుదలవుతుండగా, పది దేశాల్లో 6 వేల స్క్రీన్లలో ప్రదర్శనకు సిద్దమవుతోంది. అమెరికాలో 185 స్క్రీన్లలో విడుదలవుతోంది అని చిత్ర నిర్వహకులు తెలిపారు. ఈ చిత్రాన్ని చూడటానికి రజనీకాంత్ అభిమానులు చెన్నై నుంచి పక్క గ్రామాలకు తరలివెళ్లినట్టు సమాచారం. ఇప్పటికే అభిమానులు తొలి ఆటను చూడటానికి టిక్కెట్లను కొనుగోలు చేసి.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వారాంతానికి టికెట్లన్ని అమ్మకం జరిగాయని మల్టిప్లెక్స్ యాజమాన్యం తెలిపారు. దీపికా పదుకోనె, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, ఆది పినిశెట్టి, నాజర్, శోభన తదితరులు నటించిన ఈ చితం మే 9 తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.