చిలీలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
చిలీ తీరాన్ని భారీ భూకంపం తాకింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.2గా నమోదైంది. దీంతో ఒమత్తం లాటిన్ అమెరికా పసిఫిక్ తీరం మొత్తానికి సునామీ హెచ్చరికలు జారీచేసినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రస్తుతానికి భూకంపం, సునామీ వల్ల నష్టాలు జరిగినట్లు ఇంకా ఏమీ తెలియరాలేదు. ఎల్క్విక్ గనుల ప్రాంతానికి 86 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైన ఈ భూకంపం సముద్ర మట్టానికి కేవలం 10 కిలోమీటర్ల దిగువన మాత్రమే ఉంది. దాంతో ఇది చాలా బలంగా ఉన్నట్లు యూఎస్జీఎస్ తెలిపింది.
ప్రపంచంలోనే భూకంపాలు అత్యంత ఎక్కువగా వచ్చే దేశాల్లో దక్షిణ అమెరికా దేశమైన చిలీ ఒకటి. దీనికి ఉత్తరాన పెరూ, ఈశాన్యంలో బొలీవియా, తూర్పున అర్జెంటీనా ఉన్నాయి. సునామీ ప్రమాదం పొంచి ఉండటంతో చిలీ అధికారులు టీవీ చానళ్ల ద్వారా ప్రచారం చేసి, తీరప్రాంతాల వాసులను వెంటనే ఖాళీ చేయించారు. పెరూ, ఈక్వెడార్, కొలంబియా, పనామా, కోస్టారికా, నికరాగువా దేశాల్లోని తీరప్రాంతాలన్నింటికీ సునామీ ముప్పు పొంచి ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దాదాపు రెండు మీటర్ల ఎత్తున అలలు వచ్చి చిలీలోని పిసగువా పట్టణాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇది చాలా విధ్వంసకంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. 2010 సంవత్సరంలో కూడా చిలీలో 8.8 తీవ్రతతో భూకంపం, తర్వాత సునామీ రావడంతో అనేక పట్టణాలు చెల్లాచెదురైపోయాయి.