నైరుతి పవనాల రాక రేపు !
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని ఒకరోజు ఆలస్యంగా శనివారం పలకరించనున్నాయి. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తొలి అంచనాల ప్రకారం మే 30న నైరుతీ రుతుపవనాలు కేరళను తాకుతాయని పేర్కొంది. ఆ తర్వాత జూన్ ఐదున తాకవచ్చని అంచనా వేసింది. ఆ అం చనా కూడా మారుస్తూ.. ఈ నెల ఆరున దేశ ప్రధాన భూభాగంలోకి ‘నైరుతి’ ప్రవేశిస్తుందని గురువారం వెల్లడించింది.
కేరళలో రుతుపవనాల ప్రవేశానికి అనువైన వాతావరణం అరేబియా సముద్రంలో లేకపోవడంతో జాప్యం జరుగుతోందని ఐఎండీ తెలిపింది. తాజాగా ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనద్రోణి బలపడుతోంది. ఇది శుక్రవారానికి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో అక్కడ చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు శనివారం నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ భావిస్తోంది.
ద్రోణుల ప్రభావంతో వానలు..
మరోవైపు విదర్భ నుంచి రాయలసీమ, తెలంగాణల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి ఉపరితల ద్రోణి కూడా తోడయింది. అలాగే కోస్తాంధ్రకు ఆవల పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇంకా రుతుపవనాల ముందస్తు వాతావరణం వెరసి రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల, తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని ఐఎండీ గురువారం నాటి నివేదికలో తెలిపింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది.