ఉద్రిక్తత నడుమ నడిగర్ ఎన్నికలు
♦ దక్షిణ భారత నటీనటుల సంఘం
♦ ఎన్నికల్లో విశాల్ వర్గం విజయం
♦ అధ్యక్షుడిగా నాజర్..
♦ {పధాన కార్యదర్శిగా విశాల్ ఎన్నిక
సాక్షి, చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలు ఆదివారం ఉద్రిక్తతల మధ్య జరిగాయి. తొమ్మిదేళ్లుగా అప్రతిహతంగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నటుడు శరత్ కుమార్ ప్యానల్‌పై.. కుర్రహీరో విశాల్ ప్యానల్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరచింది. విశాల్ ప్యానల్ తరపున అధ్యక్షుడిగా పోటీ చేసిన కేరెక్టర్ నటుడు నాజర్ శరత్‌పై 109 ఓట్లతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా విశాల్ 141 ఓట్ల తేడాతో గెలిచారు. కోశాధికారిగా మరో నటుడు కార్తి గెలుపొందారు. చెన్నై హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పద్మనాభన్ నేతృత్వంలో.. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఓటింగ్ నిర్వహించినప్పటికీ.. రెండు వర్గాల మధ్య వాగ్యుద్ధాలు.. భౌతిక దాడులు.. ఘర్షణలతో పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ కేంద్రంలో శరత్‌కుమార్, విశాల్ ల మధ్య తీవ్రంగా వాగ్యుద్ధం చోటు చేసుకుంది.
ఇదే సమయంలో శరత్‌కుమార్ వర్గానికి చెందిన కొందరు విశాల్‌పై దాడి చేశారని.. పోలింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చిన తరువాత విశాల్ ఆరోపించారు. అయితే విశాల్ ఆరోపణలను శరత్‌కుమార్ ఖండించారు. అయితే ఇదే సమయంలో దక్షిణ భారత నటీనటుల సంఘం పేరును తమిళనాడు నటీనటుల సంఘంగా మార్చాలని రజనీకాంత్ ఓటు వేసేందుకు వచ్చిన సందర్భంగా డిమాండ్ చేశారు. నడిగర్ సంఘంలో ఉన్న వాళ్లంతా తమిళనటీనటులే కావటం వల్ల దానికి దక్షిణభారత నటీనటుల సంఘం అనటం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఇక కమల్‌హసన్ మరో అడుగు ముందుకు వేసి భారతీయ సినీనటుల సంఘంగా పేరు పెట్టాలన్నారు. మొత్తం 3,139మంది కళాకారులు సభ్యులుగా ఉన్న నడిగర్ సంఘంలో 1,824 మంది ప్రత్యక్షంగా, 783 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకున్నారు.