మా ఫోన్ల వాడకం ఆపండి..!
సియోల్ : దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం, ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ శాంసంగ్ వినియెగదారులకు క్షమాపణలు చెప్పింది. శాంసంగ్ జెంబో స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 7 వాడకం పై శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. బ్యాటరీ పేలుతున్న ఘటనలతో ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్ల ఫోన్లను రీకాల్ చేస్తున్న సంస్థ చివరికి తమ గెలాక్సీ నోట్ 7 ఫోన్ల వాడకాన్ని నిలిపివేయాలని ప్రకటించింది. దక్షిణకొరియాలోని వినియోగదారులు గెలాక్సీ నోట్ 7 ఫోన్లను వినియోగించవద్దంటూ అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించింది. తాత్కాలిక వినియోగం కోసం అద్దె ఫోన్లను తమ కంపెనీ సేవాకేంద్రాలనుంచి పొందొచ్చని స్థానిక వినియోగదారులకు సూచించింది. అలాగే కొత్త బ్యాటరీలతో సెప్టెంబర్ 19 నుంచి ఫోన్లను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. తన ఉత్పత్తులకు విలువనిచ్చే వినియోగదారులకు హృదయపూర్వక క్షమాపణలు తెలియజేసింది. అమెరికా యూజర్లకు కూడా ఇదే సూచనలు జారీ చేసింది.
కాగా ఆగస్ట్ 19 న అట్టహాసంగా విడుదల చేసిన గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు పేలుతున్నాయన్న వార్తలు సంచలనంగా మారాయి. దాదాపు 35 ప్రమాదాలు సంభవించాయని స్వయంగా సంస్థ ధృవీకరించింది. లిథియం రీచార్జబుల్ బ్యాటరీలో లోపాన్ని కనుక్కున్నట్టు, వీటిని తమకు అందించిన సంస్థ తప్పిదమని తెలిపింది. దీంతో గ్లోబల్ గా కొన్ని విమాన యాన సంస్థలు నిషేధాజ్ఞలు జారీ చేసిన సంగతి తెలిసిందే.