బాధితులకు సీఎం పరామర్శ
షోలాపూర్, న్యూస్‌లైన్: దక్షిణ షోలాపూర్ తాలూకాలోని పలు ప్రాంతాలలో వడగండ్ల వర్షం కురిసి పంటలు కోల్పోయిన రైతులను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మంగళవారం ఓదార్చారు. ఎడ్లబండిపై చవాన్ తాలూకాలోని హోటగి, పతాటె వాడి, కాజికణబసు గ్రామాల్లో పర్యటించారు. ఈ గ్రామాలలో వడగండ్ల వానవల్ల పంట పొలాలకు తీవ్రనష్టం వాటిల్లింది. పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ద్రాక్ష తోటలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. పశువులు, గొర్రెలు అధిక సంఖ్యలో మృతి చెందాయి. స్థానిక ఇళ్లలో గోడలు కూలి, పైకప్పులు పడిపోవడంతో కొంతమంది నిరాశ్రయులయ్యారు.
సీఎం చవాన్ ఉదయం విమానం ద్వారా పట్టణ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే స్వాగతాలను పక్కనపెట్టి వెంటనే వడగండ్ల వానకు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించేందుకు ప్రాధాన్యతనిచ్చారు. ఆయన వెంట పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావు ఠాక్రే, పునరావాస శాఖ సహాయ మంత్రి పతంగ్‌రావు కదంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. నష ్టనివారణ విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనేకమంది ముఖ్యమంత్రికి తమ ప్రాంతాలకు సంబంధించిన నివేదికలు అందజేశారు. మధ్యాహ్నం సీఎం తన పర్యటనను ముగించుకొని ఉస్మానాబాద్‌కు వెళ్లారు.