మరో ద్రోణి
సాక్షి, చెన్నై: నైరుతీ, ఈశాన్య రుతు పవనాల ప్రభావం రాష్ర్టం మీద అంతంత మాత్రమే. దక్షిణాదిలోని తిరునల్వేలి, కన్యాకుమారిని మాత్రం ఈశాన్య రుతుపవనాలు కరుణించాయి. మిగిలిన చోట్ల ప్రభావం కరువే. అయితే, వరుసగా పైలీన్, హెలెన్, లెహర్ తుపాన్ల రూపంలో వర్షాలు పడుతుండడంతో అన్నదాతకు ఊరట కలుగుతోంది. ఈ తుపాన్ల ప్రభావంతో రాష్ట్రానికి పెను నష్టం తప్పినా, వర్షాలు మాత్రం పడుతుండటం విశేషం. లెహర్ బలహీన పడిన తర్వాత ఓ మూడు నాలుగు రోజులు వర్షాలు తెరపిచ్చాయి. అయితే, శనివారం బంగాళా ఖాతంలో నైరుతీ దిశలో ఏర్పడ్డ అల్ప పీడనం ప్రభావంతో సముద్ర తీర, దక్షిణాది జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. రాత్రుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఈ ద్రోణి శ్రీలంక - ఉత్తర తమిళనాడు వైపుగా నైరుతీ-వాయువ్య దిశలో సాగుతోంది.
అదే సమయంలో బంగాళాఖాతంలో ఆదివారం మరో ద్రోణి బయలు దేరింది. ఆగ్నేయంలో నెలకొన్న ఈ ద్రోణి క్రమంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు ద్రోణుల పుణ్యమా అని రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావంతో చెన్నై, కడలూరు, నాగపట్నం, తూత్తుకుడి, కన్యాకుమారి తదితర సముద్ర తీరాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదివారం చిదంబరంలో అత్యధికంగా 11 సె.మీ, కాయిల్ పట్టినం, తిరుప్పూండిలో పది సెం.మీ, కులశేఖర పట్నంలో 8 సె.మీ, రామనాధపురంలో ఆరు సె.మీ వర్షం పడ్డట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. చెన్నై, కాంచీపురంలో కూడా వర్షం పడింది. ఆకాశం మేఘావృతమైంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో చలి మరికాస్త ఎక్కువైంది.