ఆయుష్, సుభాష్‌లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్లు సత్తా చాటారు. గచ్చిబౌలిలోని ‘శాట్స్’ షూటింగ్ రేంజ్లో జరిగిన ఈ పోటీల్లో 7 పతకాలతో ఆకట్టుకున్నారు. మంగళవారం జరిగిన స్కీట్ ఈవెంట్లో ఆయుష్ రుద్రరాజు, సుభాష్ చింతలపాటి స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. ఎన్–79 క్లే పీజియన్ స్కీట్ షూటింగ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో ఆయుష్ 60 పాయింట్లకు గానూ 48 పాయింట్లు స్కోర్ చేయగా, 46 పాయింట్లు సాధించిన గుస్తీ నోరియా (తెలంగాణ) రజతాన్ని సాధించాడు. సుభాష్ చింతలపాటి (తెలంగాణ) 38 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని గెలచుకున్నాడు.
ఎన్–80 క్లే పీజియన్ స్కీట్ షూటింగ్ జూనియర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో సుభాష్ (తెలంగాణ) 125 పాయింట్లకు 110 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆయుష్ 103 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఎన్–82 క్లే పీజియన్ స్కీట్ షూటింగ్ మహిళల, జూనియర్ మహిళల విభాగంలో రాష్ట్రానికి చెందిన దండు కాత్యాయని రాజు విజేతగా నిలిచి రెండు స్వర్ణాలను గెలుచుకుంది. ఇందులో పతకాలు సాధించిన షూటర్లు ఢిల్లీలో జరిగే జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు.
ఇతర విభాగాల విజేతల వివరాలు
జడ్–79 క్లే పీజియన్ స్కీట్ షూటింగ్ పురుషులు: 1. మునెక్, 2. రిజ్వాన్ ఉస్మాన్, 3. మొహమ్మద్ సలీమ్ మూసా.
జడ్–81 క్లే పీజియన్ స్కీట్ షూటింగ్ జూనియర్ పురుషులు: 1. మునెక్, 2. ఆర్. నవనీతన్.