‘ఫైనల్’ వేదిక మారింది!
దుబాయ్: తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ వేదికను అనూహ్యంగా మార్చాల్సి వచ్చింది. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కేంద్రమైన లార్డ్స్ మైదానంలో ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. అయితే ఇంగ్లండ్‌లో తాజా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇది సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చింది. ఒప్పందం ప్రకారం ఇంగ్లండ్‌లో జరపాల్సి ఉండటంతో సౌతాంప్టన్‌కు మ్యాచ్‌ను తరలించారు. ఇక్కడి రోజ్‌బౌల్ మైదానంలో ఇరు జట్లు తుది పోరులో తలపడతాయి.
స్టేడియం లోపలి భాగంలోనే ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉండటంతో ‘బయో బబుల్’ ఏర్పాటు చేసేందుకు ఇది సరైన చోటుగా ఐసీసీ భావించింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని బయటపెట్టాడు. తాను మ్యాచ్ చూసేందుకు వెళ్లనున్నట్లు కూడా అతను వెల్లడించాడు. ‘వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు నేను వెళుతున్నాను. విరాట్ కోహ్లి సారథ్యంలోని మన జట్టు విలియమ్సన్ కెప్టెన్సీలోని కివీస్‌ను ఓడించగలదనే నమ్మకముంది. మనకంటే ముందే అక్కడికి చేరే న్యూజిలాండ్ రెండు టెస్టులు కూడా ఆడుతుంది’ అని గంగూలీ స్పష్టం చేశాడు. మే 30న ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్‌కు వెళుతుంది. ఐసీసీ ఇప్పటికే సదరు హోటల్ మొత్తాన్ని జూన్ 1 నుంచి 26 వరకు బుక్ చేసేసింది. అక్కడే టీమిండియా ఆటగాళ్లు 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను పాటించాల్సి ఉంటుంది.
టీమిండియాపై గంగూలీ ప్రశంసలు
భారత జట్టు ఇటీవల సాధించిన విజయాల పట్ల గంగూలీ ఆనందం వ్యక్తం చేశాడు. కెప్టెన్లుగా రహానే, కోహ్లి పనితీరును అభినందించాడు. యువ ఆటగాడు రిషభ్ పంత్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘సుదీర్ఘ కాలంగా బయో బబుల్‌లో ఉంటూ ఇలాం టి ఫలితాలు సాధించడం నిజంగా అద్భుతం. బ్రిస్బేన్‌లో విజయం గురించి ఎంత చెప్పినా తక్కు వే. బుమ్రా లేకుండా ఆ మ్యాచ్ గెలిచాం. నా దృష్టి లో సెహ్వాగ్, యువరాజ్, ధోని తరహాలో ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించగల సత్తా పంత్‌లోనూ ఉంది. ఇక రిజర్వ్ బెంచ్ బలంగా ఉండటంలో ద్రవి డ్ పాత్ర కూడా గొప్పది’ అని గంగూలీ అన్నాడు.