ఇరాక్‌లో బాంబు పేలుడు: ఎనిమిది మంది మృతి
ఉత్తర ఇరాక్‌లోని దక్షిణ కిర్క్లో ఓ మసీద్‌కు అత్యంత సమీపంలో ఈ రోజు ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ఎనిమిది మంది మరణించారని పోలీసులు మంగళవారం వెల్లడించారు. మరో 12 మంది గాయపడ్డారని తెలిపారు. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
ఈ రోజు ఈద్ అల్ అద పండగ. ఈ సందర్బంగా మసీద్‌లో ప్రార్థనలు తెల్లవారుజాము నుంచి ప్రారంభమైనాయని, అందు కోసం అధిక సంఖ్యలో ముస్లింలు మసీద్ చేరుకున్నారని తెలిపారు. అయితే పేలుళ్లకు తామే బాధ్యులమంటూ ఏ తీవ్రవాద సంస్థ ఇప్పటి వరకు ప్రకటించలేదని పోలీసులు తెలిపారు. అల్ ఖైదా తీవ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.