వేసవిలో కోతలే ఉండవ్
ఒంగోలు: వేసవిలో కరెంటు కోతలే ఉండవు, అందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టినట్లు ఏపీఎస్పీడీసీఎల్ (దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ) చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ హెచ్.వై.దొర అన్నారు. స్థానిక ఎస్ఈ చాంబర్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే 45 కొత్త సబ్స్టేషన్లు నిర్మించనున్నట్లు తెలిపారు. హైఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ సిస్టం కింద కనిగిరికి రూ.45 కోట్లు, మార్కాపురానికి రూ.88 కోట్లు వెరసి మొత్తం రూ.130 కోట్లతో నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు.
జపాన్ సహాయంతో ప్రస్తుతం రూ.46 కోట్ల పనులు కూడా జరుగుతున్నాయని, ఇప్పటి వరకు 50 శాతం పూర్తయ్యాయన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 4 వేల పంపుసెట్లకు సోలార్ ఎనర్జీ అందించాలని లక్ష్యంగా నిర్ణయించామని, దీనికి 30 శాతం సబ్సిడీ పోను వినియోగదారుడు రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లా పరిధిలో 500 సోలార్ పంపుసెట్లు రైతులకు అందించాలని నిర్ణయించామన్నారు. వేసవిలో కోతలు రాకుండా ఉండేందుకుగాను ఇప్పటికే ఎన్టీపీసీ, ట్రాన్స్‌కోలతో వెయ్యి మెగావాట్లు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నామని చెప్పారు.
కృష్ణపట్నం ధర్మల్ వపర్ స్టేషన్ వద్ద 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని, వేసవిలో మరో 2 వేల మెగావాట్ల అవసరాన్ని ముందుగానే అంచనా వేసుకొని బయట నుంచి కొనుగోలుకు సిద్ధమయ్యామన్నారు. అందువల్ల రాబోయే వేసవిలో కోతలే ఉండవన్నారు. అపార్టుమెంట్లు నిర్మించే సమయంలో సబ్స్టేషన్లు నిర్మించకపోతే నాణ్యమైన విద్యుత్తు ఇవ్వడం అసాధ్యమన్నారు. స్థలాభావం వల్ల తాము కూడా నిర్మించలేకపోతున్నామని, అపార్టుమెంట్ల నిర్మాణం జరిగే సమయంలోనే సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం స్థలాన్ని వదలాలని కోరుతున్నామన్నారు. దీనికి సంబంధించి ఒంగోలులో 450 ప్లాట్లు కలిగిన అపార్టుమెంట్ల యజమానులతో ఒప్పందం పూర్తయిందని, అందులో త్వరలోనే నిర్మాణ పనులు చేపడతామన్నారు.
గతంలో స్థలం పెద్ద మొత్తంలో కావాలనేవారని, కానీ ప్రస్తుత స్థితిలో కనీసం 500 చదరపు గజాలు ఇచ్చినా ఇండోర్ సబ్స్టేషన్లు నిర్మిస్తామని సీఎండీ తెలిపారు. సోలార్ విద్యుత్‌ను వినియోగించేవారి వద్ద అదనపు విద్యుత్ ఉంటే కొనుగోలు చేసేందుకు సోలార్ నెట్ మీటర్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్ డెరైక్టర్ టి.రాంసింగ్, సీఈ రాజబాపయ్య, ఎస్ఈ ఎ.జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.