నేను హీరో కావడానికి ఆ నలుగురూ కారణం - - గోపీచంద్
‘‘మిమ్మల్ని చూస్తుంటే మా ఇంటికొచ్చిన ఫీలింగ్. ఒంగోలులో ఫంక్షన్ పెట్టినందకు ఆనంద్‌ప్రసాద్‌కి థ్యాంక్స్. భవ్య క్రియేషన్స్‌లో ఫ్రీడమ్ ఉంటుంది. నేను హీరో కావడానికి ముత్యాల సుబ్బయ్య, ఎం. నాగేశ్వరరావు, చప్పిడి హనుమంతరావు, తిరుపతిరావు... ఈ నలుగురూ కారణం’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్, రెజీనా జంటగా ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సౌఖ్యం’. ఈ చిత్రం ఆడియో వేడుక ఆదివారం రాత్రి ఒంగోలులో జరిగింది. అనూప్ రూబెన్స్ స్వరపరచిన పాటలను గోపీచంద్ ఆవిష్కరించి ఒంగోలు ఎమ్మెల్యే జనార్థన్‌కు ఇచ్చారు. గోపీచంద్ మాట్లాడుతూ - ‘‘పదకొండేళ్ల తర్వాత రవికుమార్‌తో చేసిన సినిమా ఇది. అనూప్ మంచి పాటలిచ్చారు. శ్రీధర్ సీపాన మంచి కథ ఇచ్చారు.
కోన వెంకట్, గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే విషయంలో చాలా హెల్ప్ చేశారు. అన్నే రవి నా బ్రదర్ లాంటివాడు. ఇద్దరం కలసి సినిమాలు డిస్కస్ చేసుకుంటుంటాం. ఒంగోలు ఎమ్మెల్యే జనార్ధన్, నేను క్లాస్మేట్స్. మా నాన్నగారు రూపొందించిన ‘నేటి భారతం’ వంద రోజుల వేడుక ఒంగోలులో జరిగినప్పుడు ఓ ఆడియన్‌గా ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడిలా అందర్నీ కలవడం ఆనందంగా ఉంది’’ అంటూ అభిమానుల కోరిక మేరకు ‘నేను కౌంట్ చేయడం అంటూ మొదలు పెడితే నువ్వు రీ కౌంట్ చేసుకోవడానికి నీ వైపు నుంచి ఒక్కడుండడు’ అని డైలాగ్ చెప్పారు. ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘మామూలుగా సినిమా ఫంక్షన్స్ అన్నీ ఏసీ హాళ్లలో జరుగుతుంటాయి. కానీ, ప్రేక్షకుల సమక్షంలో జరుపుకోవాలనుకుంటాను. ‘లౌక్యం’ని విజయవాడలో చేశాం. ‘సౌఖ్యం’ కోసం ఒంగోలు వచ్చాం. గోపీచంద్‌తో మా అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చదువు చెప్పింది గుంటూరు జిల్లా. బతుకు ఇచ్చింది ఒంగోలు. దర్శకునిగా మొదటి బ్రేక్ ‘యజ్ఞం’తో వచ్చింది. ఆ చిత్రనిర్మాత బాబూరావుగారిది ఒంగోలు. ఇప్పుడీ చిత్రానికి అవకాశం ఇచ్చిన ఆనంద్‌ప్రసాద్‌కు ధన్యవాదాలు’’ అని దర్శకుడు చెప్పారు. రెజీనా పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆమెతో కేక్ కట్ చేయించి, చిత్రబృందం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావుతో పాటు ఆర్. నారాయణమూర్తి, గిరిబాబు, రఘుబాబు, గౌతంరాజు, అనూప్ రూబెన్స్ తదితర చిత్రరంగ ప్రముఖులు పాల్గొన్నారు.