SP AAKE ravikrsna
-
భార్య బంధువుల నుంచి రక్షణ కల్పించండి
బనగానపల్లె వాసి ఎస్పీకి వినతి కర్నూలు: భార్య తరఫు బంధువుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బనగానపల్లెకు చెందిన నడిపి హుసేన్ ఎస్పీ ఆకే రవికృష్ణను వేడుకున్నారు. సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీ, అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో నేరుగా వచ్చి కలసినవారి నుంచి ఎస్పీ వినతులను స్వీకరించారు. సాయంత్రం వరకు పోలీసు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బనగానపల్లె వాసి నడిపి హుసేని ఎస్పీని కలసి వినతిపత్రం రూపంలో తన సమస్యను చెప్పుకున్నారు. తన భార్య సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కొట్టడం జరిగిందని, అందుకు ఆమె తరపు బంధువులు వచ్చి తనను చితకబాదడంతో తప్పించుకుని పారిపోయానని పేర్కొన్నాడు. రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు, కొంత నగదు తీసుకువెళ్లారని ఫిర్యాదు చేశాడు. చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాల్సిందిగా వేడుకున్నాడు. తన కుమారునికి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బుక్కాపురం భాస్కర్‌రెడ్డి రూ.లక్ష తీసుకుని మోసం చేశాడని పసుపుల గ్రామానికి చెందిన రాముడు ఫిర్యాదు చేశాడు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నానని, పదో తరగతి పాసైన తన కుమారునికి రైల్వే శాఖలో హెల్పర్ పోస్టు ఇప్పిస్తానని భాస్కర్‌రెడ్డి నమ్మించి రూ.లక్ష తీసుకుని డబ్బులు ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరాడు. తన కుమార్తె వివాహం జరిగిన రెండు రోజుల నుంచి అజ్ఞాత వ్యక్తులు ఆమె మొబైల్‌కు వివిధ నెంబర్ల నుంచి ఇబ్బందికరమైన బ్లాక్మెయిల్ మెసేజ్‌లు పంపుతూ కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని, వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదు చేశారు. బంగారు షాపులో పనిచేస్తున్న స్నేహితుడు ఒకరు నా భార్యకు ఫోన్ చేసి ఇబ్బంది ప్రవర్తిస్తున్నాడని డోన్ మండలానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తరచూ తనతో ఫోన్లో మాట్లాడకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. బేతంచెర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలుములపల్లి గ్రామంలో బెల్టుషాపు ఏర్పాటుతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, మద్యం సేవించినవారు అల్లర్లు, గొడవలు సృష్టిస్తున్నారని, బెల్టు షాపు నిర్మూలించి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఎస్పీ, ప్రజాదర్బార్లకు వచ్చిన ఫిర్యాదులన్నిటిపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. -
అసాంఘిక శక్తుల అణచివేతలో రాజీ పడొద్దు
కర్నూలు: అసాంఘిక శక్తుల అణచివేతలో రాజీ పడొద్దని ఎస్పీ ఆకే రవికృష్ణ హోంగార్డులకు పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో హోంగార్డులకు వారం రోజుల పాటు నిర్వహించిన మొబలైజేషన్ తరగతుల ముగింపు వేడుకలను శనివారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి హాజరైన హోంగార్డులకు ఇండోర్, ఔట్‌డోర్ తరగతుల్లో శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను గుర్తుంచుకుని విధి నిర్వహణలో సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. వ్యాయామానికి ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పోలీసు శాఖలో పనిచేసే ఉద్యోగి ఒక్కరు తప్పు చేసినా శాఖ అంతటికీ చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. నంద్యాల హోంగార్డు యూనిట్లో పనిచేస్తూ ఇటీవల మృతి చెందిన పవన్‌కుమార్(హెచ్‌జీ527) సతీమణి ఆశకు రూ.28 వేల చెక్కును అందజేశారు. నంద్యాల హోంగార్డు యూనిట్ సిబ్బంది ఈ మొత్తాన్ని పోగు చేసి పవన్‌కుమార్ సతీమణికి ఎస్పీ చేతుల మీదుగా అందించారు. ఆశకు హోంగార్డు ఉద్యోగం కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. మొబలైజేషన్ ముగింపు వేడుకలో మంచి టర్నవుట్‌తో ప్రతిభ కనబరచిన సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డును అందజేశారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. కార్యక్రమంలో హోంగార్డ్ డీఎస్పీ కృష్ణమోహన్, ఆర్ఎస్ఐ మోహన్‌రెడ్డి, హోంగార్డు యూనిట్ ఇన్చార్జీలు పాల్గొన్నారు. -
కేసుల విచారణలో అలసత్వం వద్దు
ఏడుగురు సీఐలకు చార్జి మెమోలు కర్నూలు : కేసుల విచారణలో అలసత్వం వీడాలని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. శనివారం కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో అక్టోబర్ నెలలో నమోదైన నేరాలపై డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లెల్ల, జలదుర్గం లాంటి ప్రాంతాల్లో అంటరానితనం తదితర సమస్యల పరిష్కారంపై సంబంధిత పోలీసు అధికారుల పనితీరును ఎస్పీ తప్పుబట్టారు. తాను ఫోన్ చేసి ఆదేశించినా అలసత్వం వహించారని మండిపడ్డారు. కర్నూలు, ఆదోని పట్టణాల్లో అసాంఘిక శక్తులు మత విద్వేషం రెచ్చగొట్టే కార్యకలాపాలు చేసే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల విచారణలో అలసత్వం వహించిన ఏడుగురు సీఐలకు చార్జి మెమోలు జారీ చేశారు. మరికొంతమందిని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వచ్చే నెల సమావేశానికి పెండింగ్ కేసుల విచారణను పూర్తి చేసుకుని రాకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా తానే బాధితులను పరామర్శిస్తుంటే మీరు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. గుర్తు తెలియని మృతదేహాల కేసుల విచారణలో కర్నూలు టౌన్ పోలీసు అధికారుల పనితీరు బాగాలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎనిమిది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, విచారణ చేపట్టడానికి ఇబ్బందులేమిటంటూ సీఐలను పేరు పేరున మందలించి సత్వరమే దర్యాప్తు పూర్తి చేసి నేరస్తులను అరెస్టు చేయాలని ఆదేశించారు. గ్రేవ్ క్రైమ్, నాన్ గ్రేవ్ క్రైమ్‌లను డీఎస్పీలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. కొంతమంది ఎస్ఐలు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని ఫిర్యాదులు అందాయన్నారు. ఫ్యాక్షన్, మతపరమైన సంఘటనలు జరిగినప్పుడు వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. డిసెంబర్ 6వ తేదీన మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నందున అందరూ వినియోగించుకోవాలని సూచించారు. సమావేశానికి అదనపు ఎస్పీ శివకోటి బాబురావు, డీఎస్పీలు సీఐలు, ఎస్ఐలు సమావేశానికి హాజరయ్యారు. -
పోలీసుగా గర్వించాలి
కర్నూలు : పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి గర్వపడాలని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. నిరంతరం సమస్యలు ఎదుర్కొంటూనే సమాజ రక్షణకు కృషి చేస్తున్నందుకు ఇతర శాఖల ఉద్యోగుల కంటే ఎక్కువగా గర్వపడాలన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి స్థానిక మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పోలీసు కుటుంబాలతో ఓపెన్ హౌస్ నిర్వహించారు. కుటుంబ సంక్షేమం కంటే సమాజ సంక్షేమమే మిన్నగా భావించి పోలీసులు వారాల తరబడి కుటుంబాలకు దూరంగా గడుపుతున్నప్పటికీ వారికి సహకరిస్తున్నందుకు పోలీసు కుటుంబాల మహిళలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు సీఐలు, ఎస్ఐల సతీమణులతో మాట్లాడించారు. కుటుంబపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటు పడేది పోలీసు ఉద్యోగులేనని, ఇందుకు వారి కుటుంబ సభ్యులు ఆనందపడాలని ఎస్పీ అన్నారు. పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది పనితీరు, పాలనా వ్యవహారాలు తదితర విషయాలపై పోలీసు కుటుంబాలకు అవగాహన కల్పించడం కోసమే ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీమణితో కలసి ఎస్ఐ, సీఐల కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఆయుధాగారం, రికార్డుల నిర్వహణ, డయల్ 100, డయల్ యువర్ ఎస్పీ, రిసెప్షన్ కౌంటర్ నిర్వహణ, కేసుల నమోదు, కమ్యూనికేషన్ తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను మననం చేసుకుంటూ తాము కూడా విధులను అంకితభావంతో నిర్వర్తిస్తామంటూ ఈ సందర్భంగా పోలీసులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బాబురావు, ఏఆర్ డీఎస్పీ అశోక్‌బాబు, కర్నూలు డీఎస్పీ డి.వి.రమణమూర్తి, సీఐలు ప్రవీణ్‌కుమార్, రంగనాయకులు, నాగరాజు రావు, రామయ్య నాయుడు, శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ, కృష్ణయ్య, వినోద్‌కుమార్, మహిళా సీఐ గౌతమి తదితరులు పాల్గొన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల వలే పోలీసు ఉద్యోగులకు కూడా వారాంతపు సెలవు ఇవ్వాలని సీఐల సతీమణులు .. ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఈ విధానం అమలవుతుందని, సమస్యాత్మక ప్రాంతాల్లో కొంత ఇబ్బందిగా ఉందని, అవసరాన్ని బట్టి వారంతపు సెలవులు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకరించారు.