కేసుల విచారణలో అలసత్వం వద్దు
ఏడుగురు సీఐలకు చార్జి మెమోలు
కర్నూలు : కేసుల విచారణలో అలసత్వం వీడాలని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. శనివారం కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో అక్టోబర్ నెలలో నమోదైన నేరాలపై డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లెల్ల, జలదుర్గం లాంటి ప్రాంతాల్లో అంటరానితనం తదితర సమస్యల పరిష్కారంపై సంబంధిత పోలీసు అధికారుల పనితీరును ఎస్పీ తప్పుబట్టారు. తాను ఫోన్ చేసి ఆదేశించినా అలసత్వం వహించారని మండిపడ్డారు. కర్నూలు, ఆదోని పట్టణాల్లో అసాంఘిక శక్తులు మత విద్వేషం రెచ్చగొట్టే కార్యకలాపాలు చేసే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.
కేసుల విచారణలో అలసత్వం వహించిన ఏడుగురు సీఐలకు చార్జి మెమోలు జారీ చేశారు. మరికొంతమందిని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వచ్చే నెల సమావేశానికి పెండింగ్ కేసుల విచారణను పూర్తి చేసుకుని రాకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా తానే బాధితులను పరామర్శిస్తుంటే మీరు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు.
గుర్తు తెలియని మృతదేహాల కేసుల విచారణలో కర్నూలు టౌన్ పోలీసు అధికారుల పనితీరు బాగాలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎనిమిది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, విచారణ చేపట్టడానికి ఇబ్బందులేమిటంటూ సీఐలను పేరు పేరున మందలించి సత్వరమే దర్యాప్తు పూర్తి చేసి నేరస్తులను అరెస్టు చేయాలని ఆదేశించారు.
గ్రేవ్ క్రైమ్, నాన్ గ్రేవ్ క్రైమ్‌లను డీఎస్పీలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. కొంతమంది ఎస్‌ఐలు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని ఫిర్యాదులు అందాయన్నారు. ఫ్యాక్షన్, మతపరమైన సంఘటనలు జరిగినప్పుడు వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. డిసెంబర్ 6వ తేదీన మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నందున అందరూ వినియోగించుకోవాలని సూచించారు. సమావేశానికి అదనపు ఎస్పీ శివకోటి బాబురావు, డీఎస్పీలు సీఐలు, ఎస్‌ఐలు సమావేశానికి హాజరయ్యారు.