కర్నూలు : పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి గర్వపడాలని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. నిరంతరం సమస్యలు ఎదుర్కొంటూనే సమాజ రక్షణకు కృషి చేస్తున్నందుకు ఇతర శాఖల ఉద్యోగుల కంటే ఎక్కువగా గర్వపడాలన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి స్థానిక మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పోలీసు కుటుంబాలతో ఓపెన్ హౌస్ నిర్వహించారు.
కుటుంబ సంక్షేమం కంటే సమాజ సంక్షేమమే మిన్నగా భావించి పోలీసులు వారాల తరబడి కుటుంబాలకు దూరంగా గడుపుతున్నప్పటికీ వారికి సహకరిస్తున్నందుకు పోలీసు కుటుంబాల మహిళలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు సీఐలు, ఎస్‌ఐల సతీమణులతో మాట్లాడించారు. కుటుంబపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటు పడేది పోలీసు ఉద్యోగులేనని, ఇందుకు వారి కుటుంబ సభ్యులు ఆనందపడాలని ఎస్పీ అన్నారు.
పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది పనితీరు, పాలనా వ్యవహారాలు తదితర విషయాలపై పోలీసు కుటుంబాలకు అవగాహన కల్పించడం కోసమే ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీమణితో కలసి ఎస్‌ఐ, సీఐల కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఆయుధాగారం, రికార్డుల నిర్వహణ, డయల్ 100, డయల్ యువర్ ఎస్పీ, రిసెప్షన్ కౌంటర్ నిర్వహణ, కేసుల నమోదు, కమ్యూనికేషన్ తదితర అంశాల గురించి తెలుసుకున్నారు.
పోలీసు అమరవీరుల త్యాగాలను మననం చేసుకుంటూ తాము కూడా విధులను అంకితభావంతో నిర్వర్తిస్తామంటూ ఈ సందర్భంగా పోలీసులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బాబురావు, ఏఆర్ డీఎస్పీ అశోక్‌బాబు, కర్నూలు డీఎస్పీ డి.వి.రమణమూర్తి, సీఐలు ప్రవీణ్‌కుమార్, రంగనాయకులు, నాగరాజు రావు, రామయ్య నాయుడు, శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ, కృష్ణయ్య, వినోద్‌కుమార్, మహిళా సీఐ గౌతమి తదితరులు పాల్గొన్నారు.
ఇతర ప్రభుత్వ శాఖల వలే పోలీసు ఉద్యోగులకు కూడా వారాంతపు సెలవు ఇవ్వాలని సీఐల సతీమణులు .. ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఈ విధానం అమలవుతుందని, సమస్యాత్మక ప్రాంతాల్లో కొంత ఇబ్బందిగా ఉందని, అవసరాన్ని బట్టి వారంతపు సెలవులు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకరించారు.
పోలీసుగా గర్వించాలి
Published Sat, Oct 18 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM
Advertisement