ఈ నెలలోనే మోదీ సభలు  | BJP Focus On Lok Sabha Elections 2024: Telangana | Sakshi
Sakshi News home page

ఈ నెలలోనే మోదీ సభలు 

Jan 8 2024 3:16 AM | Updated on Jan 8 2024 3:16 AM

BJP Focus On Lok Sabha Elections 2024: Telangana - Sakshi

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో కిషన్‌రెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ నెలలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో రెండు బహిరంగసభల్లో పాల్గొనేలో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తర తెలంగాణలో ఒకటి,  దక్షిణ తెలంగాణలో మరో సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంతి కిషన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఇన్‌చార్జ్‌ సునీల్‌బన్సల్, సహ ఇన్‌చార్జ్‌ అరవింద్‌ మీనన్‌లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించారు.  ఓటర్ల దగ్గరకు వెళ్లాలని, వారికి కేంద్ర ప్రభుత్వ విధానాలు, చేసిన, చేస్తున్న అభివృద్ధిపై వివరించాలని నిర్ణయించారు. ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పది కమిటీలతో సమావేశమయ్యారు.   ఎన్నికల్లో  ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని సునీల్‌ బన్సల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. పది కమిటీలు కేంద్ర నాయకత్వం సూచించిన విధంగా పనిచేస్తే,  రాష్ట్రంలో పది లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. నవ యువ ఓటర్ల కమిటీ, వికసిత్‌ భారత్‌ కమిటీ, శ్రీరామ మందిర్‌ దర్శన కమిటీ, లాభార్తి(లబ్ధిదారుల)అభియాన్‌ కమిటీ, మహిళ, స్వచ్ఛంద సంస్థల కమిటీ, గావ్‌ చలో, బస్తీ చలో తదితర కమిటీలతో సమావేశమయ్యారు. 

నేడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం..
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీలు డాక్టర్‌ లక్ష్మణ్, బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఆఫీసు బేరర్స్‌ పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement