SP ake ravikrsna
-
పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా
ఎస్పీ ఆకె రవికృష్ణ కర్నూలు: పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం మైదానంలో శుక్రవారం ఉదయం సివిల్, ఏఆర్ పోలీసు సిబ్బంది పరేడ్ నిర్వహించారు. ఎస్పీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులందరూ సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించినందుకు అభినందించారు. కొత్త సంవత్సరంలో దొంగతనాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, బస్టాండ్, రైల్వేస్టేషన్, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో క్రైం పార్టీ కానిస్టేబుళ్లు నిఘాను తీవ్రతరం చేయాలని ఆదేశించారు. దొంగలను పట్టుకోవడంలో అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు కొనసాగించాలని సూచించారు. పండుగల సందర్భంగా ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లేవారు విలువైన బంగారు ఆభరణాలు, బీరువాల్లో కాకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకునేలా పోలీసు సిబ్బంది సూచనలు ఇవ్వాలన్నారు. అపార్ట్మెంట్లలో ఉన్నవారు ఊర్లకు వెళ్లేటప్పుడు సెక్యూరిటీ గార్డులకు సమాచారం ఇచ్చి వెళ్లేలా అవగాహన కల్పించాలన్నారు. ఏదైనా నేరం జరిగి బాధితులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించినప్పుడు కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నందున ఆటోల్లో వారు ఒంటరిగా వెళ్లకుండా సూచనలు జారీ చేయాలన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలను మరింత పెంపొందించుకుని మెరుగైన సేవలందించాలన్నారు. పెరేడ్‌కు హాజరైన పోలీసు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ ఎస్పీ శివకోటి బాబురావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, ఏఆర్ డీఎస్పీ అశోక్‌బాబు, సీఐ రంగనాయకులు, ఆర్ఐ రంగముని, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సివిల్, ఏఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అక్రమ మైనింగ్‌కు చెక్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు /బేతంచెర్ల : జిల్లాలో అక్రమ మైనింగ్‌ను అణచివేయాలని ఎస్పీ ఆకె రవికృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా మైనింగ్ జరిపి విలువైన ఖనిజాన్ని తరలిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గనుల శాఖ అధికారులతో కలిసి అక్రమ మైనింగ్ జరగకుండా అడ్డుకట్ట వేయాలని సూచించారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి.. ఈ ప్రాంతాలో జరిగే సంఘటనలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌వో)దే బాధ్యతని ఎస్పీ స్పష్టం చేశారు. బుధవారం బేతంచెర్ల మండలంలోని గూటుపల్లె, హుసేనాపురం, పాపసాని కొట్టాల పరిసర ప్రాంతాల్లోని ఇనుప ఖనిజం గనులను ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట డోన్ డీఎస్పీ పీఎన్‌బాబు, బేతంచెర్ల సీఐ సుబ్రమణ్యం, ఎస్ఐ శ్రీధర్ ఉన్నారు. అక్రమ మైనింగ్ నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని డీఎస్పీ, సీఐ, ఎస్‌లను ఆయన ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని, వాస్తవాలను దాయవద్దని వారికి సూచించారు. అక్రమ మైనింగ్ నిర్మూలనకు చర్యలు తీసుకోకపోతే మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఇంతవరకు ఎన్ని కేసులు నమోదు చేశారని, ఎన్ని వాహనాలను పట్టుకున్నారని ఆరా తీశారు. ఇప్పటికైనా అక్రమ మైనింగ్‌కు సంబంధించిన వివరాలు పంపాలని డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను ఆదేశించారు. రెవెన్యూ, మైనింగ్ శాఖ సమస్వయంతో అక్రమ మైనింగ్ నిర్మూలనకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. మైనింగ్ అక్రమార్కులకు అడ్డుకట్ట వేయడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు. అలాగే విధి నిర్వహణలో అలసత్వం వహించడం వల్లే నంద్యాల టూటౌన్ హెడ్ కానిస్టేబుల్ గురుప్రసాద్, కానిస్టేబుల్ మాబాషను సస్పెండ్ చేయడంతో పాటు ఎస్ఐ సురేంద్రనాథ్‌రెడ్డికి మెమో జారీ చేసినట్లు తెలిపారు. సొంత శాఖను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో చర్యలు చేపట్టామన్నారు. ఎస్హెచ్వోలదే పూర్తి బాధ్యత..! మరోవైపు అక్రమ మైనింగ్‌లో పోలీసులకూ వాటాలు అందుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అందుకే అక్రమంగా ఇనుప ఖనిజం తరలిపోతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. గతంలో డోన్ ప్రాంతంలో పనిచేసిన ఒక పోలీసు అధికారికి నెలవారీ మామూళ్లు ఇవ్వకపోవడంతో ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. నెలవారీ మామూళ్లు ఇంత ఇస్తేనే పట్టించుకోనని సదరు యాజమాన్యాలకు స్పష్టం చేశారు. లేనిపక్షంలో రోజూ ట్రాక్టర్లను సీజ్ చేస్తానని బెదిరించారు. చివరకు బేరం కుదిరిన తర్వాత యథావిధిగా ఇనుప ఖనిజం అక్రమ రవాణాను చూసీ చూడనట్టు వదిలేశారన్న ప్రచారమూ ఇప్పటికే ఉంది. అదేవిధంగా వెల్తుర్తి ప్రాంతంలో అధికార పార్టీ నేతలకు టన్నుకు రూ.250 చెల్లించలేదన్న కారణంగా ఒక కంపెనీకి వెళ్లే దారిని పూర్తిగా మూసివేశారు. దీనిపై న్యాయం చేయాలని అక్కడి పోలీసు అధికారులను ఆశ్రయిస్తే... కోర్టుకు వెళ్లి చూసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఈ విధంగా మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లోని పోలీసులపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఏకంగా చంపుతామంటూ గనులశాఖ అధికారులను బెదిరించిన నేపథ్యంలో ఎస్పీ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ జరిగితే ఎస్‌హెచ్‌వోలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎస్పీ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా ఇనుప ఖనిజం తరలిపోతున్నా పట్టించుకోని పలువురు ఎస్‌హెచ్‌వోలకు ఎస్పీ మెమోలు జారీ చేసినట్టు సమాచారం. మరోవైపు తమకు ఎటువంటి బెదిరింపులు రాలేదని గనులశాఖ కర్నూలు అసిస్టెంటు డెరైక్టర్ (ఏడీ) నరసింహాచారి వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు.