పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా
ఎస్పీ ఆకె రవికృష్ణ
కర్నూలు: పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం మైదానంలో శుక్రవారం ఉదయం సివిల్, ఏఆర్ పోలీసు సిబ్బంది పరేడ్ నిర్వహించారు. ఎస్పీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులందరూ సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించినందుకు అభినందించారు.
కొత్త సంవత్సరంలో దొంగతనాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, బస్టాండ్, రైల్వేస్టేషన్, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో క్రైం పార్టీ కానిస్టేబుళ్లు నిఘాను తీవ్రతరం చేయాలని ఆదేశించారు. దొంగలను పట్టుకోవడంలో అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు కొనసాగించాలని సూచించారు. పండుగల సందర్భంగా ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లేవారు విలువైన బంగారు ఆభరణాలు, బీరువాల్లో కాకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకునేలా పోలీసు సిబ్బంది సూచనలు ఇవ్వాలన్నారు.
అపార్ట్‌మెంట్లలో ఉన్నవారు ఊర్లకు వెళ్లేటప్పుడు సెక్యూరిటీ గార్డులకు సమాచారం ఇచ్చి వెళ్లేలా అవగాహన కల్పించాలన్నారు. ఏదైనా నేరం జరిగి బాధితులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించినప్పుడు కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నందున ఆటోల్లో వారు ఒంటరిగా వెళ్లకుండా సూచనలు జారీ చేయాలన్నారు.
కొత్త సంవత్సరంలో ప్రజలకు, పోలీసులకు మధ్య సత్‌సంబంధాలను మరింత పెంపొందించుకుని మెరుగైన సేవలందించాలన్నారు. పెరేడ్‌కు హాజరైన పోలీసు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ ఎస్పీ శివకోటి బాబురావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, ఏఆర్ డీఎస్పీ అశోక్‌బాబు, సీఐ రంగనాయకులు, ఆర్‌ఐ రంగముని, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సివిల్, ఏఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.