ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: ఐదుగురు పాత నేరస్తులను సోమవారం ఇల్లెందు పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 12లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రంగనాధ్ ఈ వివరాలు తెలిపారు. ఇల్లెందు డీఎస్పీ కృష్ణ ఆధ్వర్యంలో ఇల్లెందు రూరల్ సీఐ రవీందర్‌రెడ్డి సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇల్లెందు నుంచి ఖమ్మం వెళ్లేందుకు కొత్తలింగాల క్రాస్‌రోడ్డు వద్ద ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారించగా పలు చోరీలు వెలుగులోకి వచ్చాయని ఎస్పీ తెలిపారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లికి చెందిన బెల్లంకొండ యాకయ్యపై ఇల్లెందులో 3, కారేపల్లిలో 4, కామేపల్లిలో 1, బయ్యారంలో 4 కేసులు ఉన్నాయని అన్నారు.
అదే జిల్లా అమనగల్‌కు చెందిన కూజ పెద్ద శ్రీను ఖమ్మంజిల్లా టేకులపల్లి మండలం భద్రుతండాలో ఉంటున్నాడని, ఇతనిపై ఇల్లెందులో 1, కారేపల్లిలో 3, బయ్యారంలో 3, టేకులపల్లిలో 1, ఖమ్మం రూరల్‌లో 1 కేసులు ఉన్నాయని, వరంగల్ జిల్లా చెందిన దాసరి యాకయ్య ఖమ్మం జిల్లా కోయగూడెంలో ఉంటున్నాడని, ఇతనిపై ఇల్లెందులో 1, కారేపల్లిలో 2, కామేపల్లిలో 3, బయ్యారంలో 3, టేకులపల్లిలో 1 కేసులు ఉన్నాయని అన్నారు. అదే జిల్లాకు చెందిన కూజ చిన్న శ్రీను ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి మండలం ఉంటున్నాడని, ఇతనిపై కారేపల్లిలో 1, కామేపల్లిలో 1 కేసులు ఉన్నాయని అన్నారు. అలాగే ఖమ్మం జిల్లా టేకులపల్లికి చెందిన బిజిలి నాగయ్య పై కారేపల్లిలో 1, కామేపల్లిలో 1, టేకులపల్లిలో 1కేసులు ఉన్నాయని అన్నారు. వీరిపై నాన్‌బెయిలబుల్ కేసులు ఉన్నాయని అన్నారు.
వీరు చైన్ స్నాచింగ్, ఇంటి తాళలు పగులగొట్టి చోరీలు చేసేవారని ఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి బంగారం కొనుగోలు చేసిన 10 మందిని, వీరికి సహకరించిన మరో నలుగుర్ని అరెస్ట్ చేశామని అన్నారు. వారి వద్ద నుంచి 37.5 తులాల బంగారం, 130 తులాల వెండి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అక్టోబర్ నుంచి నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌లో భారీగా రికవరీలు చేశామని ఎస్పీ తెలిపారు. ఖమ్మంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో సమావేశం నిర్వహించామని, బంగారం తాకట్టు, విక్రయానికి వచ్చిన వారి వద్ద గుర్తింపు కార్డులు ఉంటేనే తీసుకోవాలని, తెలిసిన వ్యక్తి వస్తేనే కొనుగోలు చేయాలని సూచించామని అన్నారు. అలా కాదని బంగారం కొనుగోలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బంగారం షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలు ఉంటే దొంగలను గుర్తించడం సులువవుతుందని అన్నారు. మధిర శ్రీరామ్‌సిటీ గోల్డ్ చోరీ కేసును త్వరలోనే ఛేదిస్తామని అన్నారు. ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ద్విచక్ర వాహనలు కొనుగోలు చేసేప్పుడు సరైన పత్రాలు ఉన్నాయా..? లేవా..? చూసుకోవాలని, నకిలీ ఆర్‌సీ పేపరు కేసులో నల్లగొండ ఎంవీఐని రిమాండ్ చేశామని తెలిపారు.
సిబ్బందికి రివార్డులు అందజేస్తాం..
ఈ రికవరీలో పాల్గొన్న సిబ్బంది రివార్డులు అందజేస్తామన్నారు. ఇల్లెందు డీఎస్పీ కృష్ణ, టేకులపల్లి సీఐ రాజిరెడ్డి, ఎస్సైలు శ్రీనివాసరెడ్డి, సంతోష్, ఏఎస్సై అబ్రహం, కానిస్టేబుళ్ళలకు రివార్డులు అందజేస్తామని, అదేవిధంగా రికవరీలకు ప్రత్యేక టింలు ఏర్పాటు చేశామని, రికవరీల్లో ప్రతిభ కనబర్చిన వారికి రివార్డులు అందజేస్తామని, పని చేయని వారిని విధుల నుంచి తొలగిస్తామని అన్నారు.
ఐదుగురు పాత నేరస్తుల అరెస్ట్
Published Tue, Dec 24 2013 2:44 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement