ఖమ్మం : ఘోర రోడ్డు ప్రమాదం భార్యాభర్తలను పొట్టన పెట్టుకుని ముక్కుపచ్చలారని చిన్నారులను అనాథలుగా మిగిల్చింది. తల్లిదండ్రుల మృతదేహాల వద్ద బంధువులు రోదిస్తుండడంతో ఏం జరిగిందో తెలియక చిన్నారులు అమ్మానాన్నలకు ఏమైంది? అంటూ అమాయకంగా అడుగుతుండడంతో సమాధానం చెప్పలేక బంధువులు సతమతమయ్యారు. మండలంలోని జల్లేపల్లి గ్రామానికి చెందిన దువ్వా రమేష్, రేణుకలు బంధువులతో కలిసి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వెంకట్రాపురంలోని బంధువుల ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలకు ఆదివారం వెళ్లారు. వేడుక ముగిశాక ఆదివారం రాత్రి తిరిగి వస్తుండగా అనంతగిరిలో గుంతను తప్పించే క్రమంలో ఆటో డ్రైవర్ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. ఈ ఘటనలో రమేష్, రేణుక మృతి చెందగా పోస్టుమార్టం అనంతరం సోమవారం ఉదయం మృతదేహాలను స్వగ్రామానికి తీసుకొచ్చారు.
తెల్లారాక వెళ్లాలని కోరినా....
జల్లేపల్లికి చెందిన దువ్వా రమేష్ వ్యవసాయ పనులతో పాటు హమాలీగా పనిచేస్తుండగా ఆయనకు భార్య రేణుక, ఐదేళ్ల కుమారుడు కార్తీక్, నాలుగేళ్ల కుమార్తె హాసిని ఉన్నారు. వెంకట్రాంపురంలో రమేష్ చెల్లెలు కుమారుడి బర్త్‌డే వేడుకలకు తురక వెంకన్న ఆటోలో రమేష్ తన భార్యాపిల్లలతో పాటు మరికొందరిని పంపించాడు. ఆతర్వాత తన బావమరిదితో కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్లాడు. వేడుకలు ముగిశాక చలి పెరగడంతో అక్కడే ఉండి తెల్లారాక వెళ్లాలని బంధువులు కోరారు. అయినప్పటికీ ధాన్యం కోతల సమయంలో కావడంతో రాత్రే బయలుదేరగా ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటనలో ఆటో ముందు భాగంలో కూర్చున్న రమేష్, రేణుక మృతిచెందగా ఆటో డ్రైవర్ తురక వెంకన్నకు తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్ తరలించారు. అలాగే, మిగతా వారికి కూడా బలయమైన గాయాలయ్యాయి.
మోటార్‌సైకిల్‌పై వచ్చినా బతికేవాడేమో...
దువ్వా రమేష్ వెళ్లేటప్పుడు బావమరిది మోటార్ సైకిల్‌పై వెళ్లగా వచ్చేటప్పుడు చలి పెరగడంతో ఆయన బావమరిది అక్కడే ఆగిపోయాడు. దీంతో దువ్వా రమేష్ ఆటోలో వస్తుండగా ప్రమాదం జరిగింది. ఒకవేళ ఆయన మోటార్ సైకిల్‌పై వచ్చినా ప్రాణాలు దక్కేవని చెబుతున్నారు. ఏది ఏమైనా రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందడంతో చిన్నారులు కార్తీక్, హాసిని అనాథలుగా మిగిలారు. గ్రామస్తులు రోదనల నడుమ అంత్యక్రియలు పూర్తిచేయగా బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భాషబోయిన వీరన్న తదితరులు నివాళులరి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment