నేను చనిపోయినా.. మీరు బతుకుతారు... | 77 Years Old Chit Fund Trader Commits Suicide In Khammam, More Details Inside | Sakshi
Sakshi News home page

నేను చనిపోయినా.. మీరు బతుకుతారు...

Published Tue, Dec 3 2024 8:46 AM | Last Updated on Tue, Dec 3 2024 10:21 AM

old man Life End in khammam district

లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన వ్యాపారి

చిన్నకుమారుడు – కోడలిని తన మృతదేహం వద్దకు రానివ్వొద్దని సూచన 

ఖమ్మం క్రైం: ‘అందరినీ కలిపి హత్య చేయాలనుకుంటున్నారు.. దీన్ని ఆపేందుకు నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. అప్పుడు మిగతా ఐదుగురైనా బతుకుతారు.. నా మృతదేహం వద్దకు చిన్నకుమారుడైన శేఖర్‌–సుజాతను రానివ్వొద్దు’ అంటూ పోలీసు కమిషనర్‌కు లేఖ రాసి.. ఖమ్మంకు చెందిన చిట్‌ఫండ్‌ వ్యాపారి చేకూరి సత్యంబాబు (77) ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మంలో ఈ ఘటన కలకలం రేపింది. వివరాలు..

ఖమ్మం వీడీవోస్‌ కాలనీకి చెందిన చేకూరి సత్యంబాబు చిట్‌ఫండ్‌ వ్యాపారంతో పాటు కుమారులైన శ్రీధర్, శేఖర్‌తో కలిసి ఇంకొన్ని వ్యాపారాలు చేశాడు. కొన్నాళ్ల క్రితం వ్యాపారాల నిమిత్తం చేసిన అప్పుల కారణంగా శ్రీధర్‌– శేఖర్‌కు మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో శేఖర్‌ వేరుగా ఉంటున్నాడు. సత్యంబాబు – నాగేంద్రమ్మ, వీరి పెద్దకుమారు డైన శ్రీధర్‌ కుటుంబం కలిసి ఉంటోంది. కాగా, లావా దేవీలు, అప్పులకు సంబంధించి 2017 నుంచి గొడవలు పెరగడంతో సత్యంబాబు, ఆయన పెద్దకుమారుడు, కుటుంబసభ్యులపై పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోద య్యాయి. 

ఈ క్రమంలో చిన్నకుమారుడైన శేఖర్, ఆయన భార్య సుజాత, ఆమె సోదరుడైన తాళ్లూరి గంగాధర్‌తో పాటు డాక్టర్‌ మహేంద్రనాథ్, పి.కృష్ణమోహన్‌ తమను వేధిస్తు న్నారని సత్యం కొన్నాళ్లుగా చెబుతున్నట్లు సమాచారం. అలాగే సత్యంబాబు–నాగేంద్రమ్మ, శ్రీధర్‌–ప్రవీణ దంపతులతో పాటు వారి పిల్లలు చైతన్య, చాణ క్యలను హత్య చేయాలని కొందరు కుట్ర పన్నారని సత్యంబాబు పలువురితో వెల్లడించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తానొక్కడినే చనిపోతే మిగతా ఐదుగురు బతుకుతారనే భావనతో లేఖ రాసిన ఆయన.. అందులో తన కుటుంబ వివాదాలతో పాటు ఆత్మహత్యకు కారణంగా ఐదుగురి పేర్లు రాశారు. తన మృతదేహం వద్దకు చిన్నకుమారుడైన శేఖర్‌ దంపతులను రానివ్వొద్దని కూడా పేర్కొన్నారు. 

ఈ మేరకు ఆదివారం రాత్రి గదిలో ఒంటరిగా పడుకున్న ఆయన సోమవారం ఉదయం ఎంత పిలిచినా పలకలేదు. దీంతో కుటుంబీకులు తలుపులు పగులకొట్టి చూడగా విషం తాగి మృతి చెంది ఉన్నాడు. ఈమేరకు ఖమ్మం టూటౌన్‌ ఎస్‌ఐ రవికుమార్‌ వివరాలు ఆరాతీశారు. ఐదుగురి వేధింపులతో తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, వారివల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని శ్రీధర్‌ వెల్లడించారు. కాగా, ఐదు రోజుల క్రితం ఒక కుటుంబం తమకు రూ.2 కోట్లకు పైగా సత్యంబాబు బాకీ ఉన్నాడని ఆయన ఇంటి ఎదుట నిరసన తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement