![Telangana: Four Students Drowned In Water Two Different Places - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/20/STUDENTS.jpg.webp?itok=E8k10POr)
నరేంద్రరెడ్డి, నాగ నరేంద్రరెడ్డి
మధిర/ పెనుబల్లి: రెండు వేర్వేరుచోట్ల నలుగురు విద్యార్థులు నీటమునిగారు. వీరిలో ఇద్దరు మృత్యువాతపడగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వద్ద నదిలో మునిగి ఇద్దరు ఖమ్మం జిల్లా పిల్లలు చనిపోగా, ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ కాల్వలో పడి గల్లంతయ్యారు. మధిర మున్సిపాలిటీ పరిధి మడుపల్లిలో జెల్లా కృష్ణారావు ఆధ్వర్యాన సరస్వతి విద్యాలయం కొనసాగుతోంది.
ఈ విద్యాలయానికి చెందిన విద్యార్థులను నాలుగు ఆటోల్లో కృష్ణారావు శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వద్దకు విహారయాత్ర నిమిత్తం తీసుకువెళ్లారు. వీరితోపాటు తన వద్దకు ట్యూషన్ వచ్చే ఉన్నతపాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థి శీలం వెంకట నర్సిరెడ్డి(12) కూడా వెళ్లాడు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలంతా సరదాగా గడిపాక కొద్దిసేపట్లో తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది.
ఇంతలోనే వెంకటనర్సిరెడ్డి, సరస్వతి పాఠశాలలో నాలుగో తరగతి చదివే జస్వంత్ కలిసి సమీపంలోని మున్నేరు నదిలో ఈతకొట్టేందుకు వెళ్లారు. అక్కడ పొక్లెయినర్‌తో తవ్విన లోతైన గుంతలో ఆ ఇద్దరూ ప్రమాదవశాత్తు పడిపోయారు. స్థానికులు కొందరు ఆ విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నించి ఒడ్డుకు చేర్చారు. కానీ, అప్పటికే వారు మృతి చెందారు. విహారయాత్రకు వెళ్లిన చిన్నారులు విగతజీవులుగా రావడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పెనుగంచిప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వెంకట నర్సిరెడ్డి(ఫైల్), జస్వంత్ (ఫైల్)
సాగర్ కాల్వలో పడి..
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెన కుంట్లకి చెందిన బీటెక్ విద్యార్థి తల్లపురెడ్డి నరేంద్రరెడ్డి, డిగ్రీ విద్యార్థి అవులూరి నాగనరేందర్‌రెడ్డి శనివారం గ్రామ సమీపంలోని తుమ్మలపల్లి వద్ద నాగార్జునసాగర్ కాల్వలో స్నానం చేయడానికి శనివారం వెళ్లారు. అయి తే, వీరికి ఈత రాకపోవడంతో కాల్వలో పడి గల్లంతయ్యారు. వీరి కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విష యం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఘటనాస్థలానికి చేరుకుని నీటి ప్రవాహం తగ్గించి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment