- తనిష్క్’లో చోరీ సొత్తు
- పోలీసులకు తెలిపిన యాజమాన్యం
- సీసీఎస్ బృందాల దర్యాప్తు ముమ్మరం
- పాత నేరస్తుల వివరాల సేకరణ
సాక్షి, సిటీబ్యూరో : పంజగుట్ట పరిధిలోని తనిష్క్ జ్యువెలర్స్ దుకాణంలో చోరీకి గురైన మొత్తం రూ.5.97 కోట్ల సొత్తుగా యాజమాన్యం లెక్కలు తేల్చింది. సంస్థ జనరల్ మేనేజర్ మణికందన్ శనివారం ఇచ్చిన ఫిర్యాదులో ప్లెయిన్, గోల్డ్ ఆర్నమెంట్స్ 18 కిలోలు (విలువ సుమారు రూ.11కోట్లు), కలర్ స్టోన్స్, ముత్యాలు పొదిగిన ఆభరణాలు 12 కిలోలు (విలువ సుమారు రూ.12కోట్లు) దొంగతనానికి గరైనట్లు పేర్కొన్నారు. అయితే ఆదివారం ఉదయానికి పూర్తిస్థాయిలో లెక్కలు చూసిన నిర్వాహకులు రూ.4.6 కోట్ల విలువైన 15.56 కేజీల బంగారు నగలతో పాటు మరో రూ.కోటి విలువైన రాళ్లతో చేసిన 851 ఆభరణాల్ని చోరులు ఎత్తుకుపోయారని తేల్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది తమ షోరూమ్ ధరని చెప్పడంతో వీటి మార్కెట్ విలువ రూ.8 కోట్ల వరకు ఉండచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
అంతుచిక్కని ‘కన్నం’ విధానం
బంగారం దుకాణంలో చోరీ జరిగిన తీరును మరోసారి క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. వెనుక వైపు అనువైన ప్రాంతాన్ని దుండగులు ఎలా గుర్తించారన్న దానితో పాటు లోపలకు ప్రవేశించిన తరవాత నేరుగా స్విచ్‌బోర్డ్ వద్దకు వెళ్లి లైట్లను ఎలా ఆర్పగలిగారు? అనే వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టారు. మూడో పిల్లర్‌కు పక్కగా, రెండు షెల్ఫ్‌లకు మధ్యలో కచ్చితంగా రంధ్రం చేడయం, స్విచ్ బోర్డ్ ఎక్కడ ఉందో వారికి తెలియడం వెనుక తెలిసిన వారి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత, మాజీ సెక్యూరిటీ గార్డులు, ఉద్యోగులతో పాటు సంస్థకు మరమ్మతులు చేసిన మేస్త్రీల వివరాలు రాబడుతున్నారు. ఇది కచ్చితంగా బయటి రాష్ట్రాలకు చెందిన ముఠాల పనిగా చెప్పలేమని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నమని సీసీఎస్ అధికారులు తెలిపారు.
ఇతర రాష్ట్రాలకూ సమాచారం
దర్యాప్తులో భాగంగా పాత నేరగాళ్ల వివరాలను సేకరిస్తున్న పోలీసులు వారి కదలికలపై ఆరా తీస్తున్నారు.
చోరీ కోసం దుకాణంలోకి ప్రవేశించిన దొంగ ఎడమకాలు కుంటుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది.
ఈ తరహా అంగవైకల్యం కలిగిన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన దోపిడీ దొంగ గతంలో ఎస్సార్‌నగర్ స్టేట్‌హోమ్ సమీపంలోని ఓ నర్సింగ్ హోమ్‌లో దోపిడీకి పాల్పడ్డాడు.
అలాగే పంజగుట్టలోని ఉన్న జాయ్ అలుక్కాస్ షోరూమ్‌లో 2006లో చోరీ చేసిన ముంబై వాసి వినోద్‌రాంబోలీ సింగ్‌ను అనుమానితుల జాబితాలో చేర్చారు.
వీరిద్దరి వివరాలను కోరుతూ యూపీ, ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రాంబోలీసింగ్‌ను ఇప్పటికే ముంబై క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో ఉన్న మరికొన్ని, బీహార్ తదితర పోలీసులకు తనిష్క్‌లో రికార్డు అయిన సీసీ కెమెరా ఫీడ్‌ను పంపాలని నిర్ణయించారు.
అన్ని కోణాల్లో ఆరా
ఈ చోరీలో దుండగులు ఆధారం విడిచిపెట్టకపోవడంతో పోలీసులు సెల్‌ఫోన్, సిగ్నల్ వంటివి విశ్లేషిస్తూ సాంకేతికంగా, సంప్రదాయ పద్ధతుల్లో ముందుకు వెళ్తున్నారు.
ఈ తరహా చోరీలు చేసేవారి (ఎంఓ క్రిమినల్స్) వివరాలు సేకరిస్తున్నారు.
చోరీకి వచ్చిన వాళ్లు ఎక్కడో ఒకచోట షెల్టర్ తీసుకుని ఉంటారనే అనుమానంతో నగరంలోని లాడ్జిలు, హోటళ్లలోనూ వివరాలు సేకరిస్తున్నారు.
మరోపక్క ఘటనాస్థలి నుంచి నిపుణులు పదుల సంఖ్యలో వేలిముద్రలు సేకరించారు.
శని-ఆదివారాల్లో తనిష్క్‌లో పని చేసే వారి వేలిముద్రల్ని సేకరించి విశ్లేషిస్తున్నారు.
షోరూమ్ సీసీ కెమెరాల్లో వారం రోజులుగా రికార్డైన ఫీడ్, చుట్టు పక్కల దుకాణాల్లోదీ సేకరించి విశ్లేషించడం ప్రారంభించారు.