అక్రమ మైనింగ్‌కు చెక్! | To check illegal mining! | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌కు చెక్!

Published Thu, Nov 20 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

అక్రమ మైనింగ్‌కు చెక్!

అక్రమ మైనింగ్‌కు చెక్!

సాక్షి ప్రతినిధి, కర్నూలు /బేతంచెర్ల : జిల్లాలో అక్రమ మైనింగ్‌ను అణచివేయాలని ఎస్పీ ఆకె రవికృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా మైనింగ్ జరిపి విలువైన ఖనిజాన్ని తరలిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గనుల శాఖ అధికారులతో కలిసి అక్రమ మైనింగ్ జరగకుండా అడ్డుకట్ట వేయాలని సూచించారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి.. ఈ ప్రాంతాలో జరిగే సంఘటనలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌వో)దే బాధ్యతని ఎస్పీ స్పష్టం చేశారు.

బుధవారం బేతంచెర్ల మండలంలోని గూటుపల్లె, హుసేనాపురం, పాపసాని కొట్టాల పరిసర ప్రాంతాల్లోని ఇనుప ఖనిజం గనులను ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట డోన్ డీఎస్పీ పీఎన్‌బాబు, బేతంచెర్ల సీఐ సుబ్రమణ్యం, ఎస్‌ఐ శ్రీధర్ ఉన్నారు. అక్రమ మైనింగ్ నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని డీఎస్పీ, సీఐ, ఎస్‌లను ఆయన ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని, వాస్తవాలను దాయవద్దని వారికి సూచించారు.

అక్రమ మైనింగ్ నిర్మూలనకు చర్యలు తీసుకోకపోతే మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఇంతవరకు ఎన్ని కేసులు నమోదు చేశారని, ఎన్ని వాహనాలను పట్టుకున్నారని ఆరా తీశారు. ఇప్పటికైనా అక్రమ మైనింగ్‌కు సంబంధించిన వివరాలు పంపాలని డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలను ఆదేశించారు. రెవెన్యూ, మైనింగ్ శాఖ సమస్వయంతో అక్రమ మైనింగ్ నిర్మూలనకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. మైనింగ్ అక్రమార్కులకు అడ్డుకట్ట వేయడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు.

అలాగే విధి నిర్వహణలో అలసత్వం వహించడం వల్లే నంద్యాల టూటౌన్ హెడ్ కానిస్టేబుల్ గురుప్రసాద్, కానిస్టేబుల్ మాబాషను సస్పెండ్ చేయడంతో పాటు ఎస్‌ఐ సురేంద్రనాథ్‌రెడ్డికి మెమో జారీ చేసినట్లు తెలిపారు. సొంత శాఖను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో చర్యలు చేపట్టామన్నారు.

 ఎస్‌హెచ్‌వోలదే పూర్తి బాధ్యత..!
 మరోవైపు అక్రమ మైనింగ్‌లో పోలీసులకూ వాటాలు అందుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అందుకే అక్రమంగా ఇనుప ఖనిజం తరలిపోతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. గతంలో డోన్ ప్రాంతంలో పనిచేసిన ఒక పోలీసు అధికారికి నెలవారీ మామూళ్లు ఇవ్వకపోవడంతో ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. నెలవారీ మామూళ్లు ఇంత ఇస్తేనే పట్టించుకోనని సదరు యాజమాన్యాలకు స్పష్టం చేశారు.

లేనిపక్షంలో రోజూ ట్రాక్టర్లను సీజ్ చేస్తానని బెదిరించారు. చివరకు బేరం కుదిరిన తర్వాత యథావిధిగా ఇనుప ఖనిజం అక్రమ రవాణాను చూసీ చూడనట్టు వదిలేశారన్న ప్రచారమూ ఇప్పటికే ఉంది. అదేవిధంగా వెల్తుర్తి ప్రాంతంలో అధికార పార్టీ నేతలకు టన్నుకు రూ.250 చెల్లించలేదన్న కారణంగా ఒక కంపెనీకి వెళ్లే దారిని పూర్తిగా మూసివేశారు. దీనిపై న్యాయం చేయాలని అక్కడి పోలీసు అధికారులను ఆశ్రయిస్తే... కోర్టుకు వెళ్లి చూసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు.

ఈ విధంగా మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లోని పోలీసులపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఏకంగా చంపుతామంటూ గనులశాఖ అధికారులను బెదిరించిన నేపథ్యంలో ఎస్పీ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ జరిగితే ఎస్‌హెచ్‌వోలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎస్పీ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అక్రమంగా ఇనుప ఖనిజం తరలిపోతున్నా పట్టించుకోని పలువురు ఎస్‌హెచ్‌వోలకు ఎస్పీ మెమోలు జారీ చేసినట్టు సమాచారం. మరోవైపు తమకు ఎటువంటి బెదిరింపులు రాలేదని గనులశాఖ కర్నూలు అసిస్టెంటు డెరైక్టర్ (ఏడీ) నరసింహాచారి వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement