'ఉద్యోగాలు ఇస్తేనే అంత్యక్రియలు చేస్తాం'
కపుర్తలా: దీనాపూర్ లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన కుటుంబ సభ్యులు నిరాకరించారు. తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేదాకా అంత్యక్రియలు నిర్వహించబోమని స్పష్టం చేశారు.
తమ కుమారుడికి ఎస్పీ ర్యాంకు, ఇద్దరు కుమార్తెలకు తహశీల్దార్ ఉద్యోగాలు ఇవ్వాలని బల్జీత్ సింగ్ భార్య కల్వంత్ కౌర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చే దాకా దహన సంస్కారాలు చేయబోమన్నారు. తమ మామ అచ్చార్ సింగ్ చనిపోయిన తర్వాత తన భర్తకు ఉద్యోగం కోసం రెండేళ్లు వేచిచూడాల్సి వచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు.
పోలీసు ఇన్స్ పెక్టర్ గా పనిచేసిన అచ్చర్ సింగ్ 1984 నాటి సిక్కు అల్లర్లలో మృతి చెందారు. అయితే బల్జీత్ సింగ్ కుటుంబం డిమాండ్ గురించి తమకు తెలియదని ఉన్నతాధికారులు తెలిపారు. పంజాబ్ గురుదాస్ పూర్ జిల్లాలోని దీనాపూర్ లో సోమవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఎస్పీ బల్జీత్ సింగ్ మృతి చెందారు.