టెలికాం రంగంలో 20 మిలియన్ల ఉద్యోగాలు
గచ్చిబౌలి, న్యూస్‌లైన్: దేశవ్యాప్తంగా టెలికాం రంగంలో 2025 నాటికల్లా 20 మిలియన్ల ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని టీఎస్ఎస్సీ (టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్) సీఈఓ లెఫ్ట్‌నెంట్ జనరల్ (రిటైర్డ్) ఎస్పీ కొచర్ పేర్కొన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని ఎస్కీ(ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా)లో ‘ఓకేషనల్ స్కిల్ ట్రైనింగ్ విత్ ఇండస్ట్రీ కనెక్ట్’ శిక్షణ కార్యక్రమంపై ఎస్కీ, టీఎస్ఎస్సీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ సందర్భంగా కొచర్ మాట్లాడుతూ టెలికాం రంగంలో రూ.80 కోట్ల వ్యయంతో 80 వేల మంది నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలి పారు. ఎస్కీ డెరైక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 10వ తరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువతీయువకులకు ఉచితంగా శిక్షణ, మెటీరియల్ అందజేస్తామన్నారు. శిక్షణ అనంతరం నైపుణ్యాన్ని పరీక్షించి సర్టిఫికెట్లు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ అడిషనల్ డెరైక్టర్ డాక్టర్ ధర్మరాజ్, టాటా టెలీ సర్వీసెస్ సీఓఓ రామకృష్ణ, జియోస్టార్ట్ మేనేజింగ్ పార్టనర్ వివేక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.