sp gopinath jetti
-
ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి
- మున్సిపల్ కమిషనర్‌తో ఎస్పీ సమీక్ష కర్నూలు : నగరంలో పద్మవ్యూహాన్ని తలపిస్తున్న ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ గోపినాథ్‌జట్టి ప్రత్యేక దృష్టి సారించారు. నగర పోలీసు అధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్ హరినాథ్‌రెడ్డితో ఆదివారం సమావేశమై చర్చించారు. ట్రాఫిక్ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు, రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ స్థలాలు, అవసరమైన చోట ఫుట్‌పాత్‌లు, సిగ్నల్స్, నోపార్కింగ్ బోర్డుల ఏర్పాటుపై చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాఫీగా సాగేందుకు అవసరమైన చర్యలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పోలీసు, మున్సిపల్, రోడ్డు రవాణా, నేషనల్ హైవే, ఎన్జీఓలు సిటిజన్స్ సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో లైటింగ్, చెత్తకుండీలు, ప్యాచ్‌వర్స్క్, బారికేడ్స్, వైట్‌మార్కింగ్, జీబ్రా క్రాసింగ్, సైన్‌బోర్డులు తదితర అంశాలు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకునే విధంగా సమీక్షలో చర్చించారు. ట్రాఫిక్ సిబ్బందిని మరింత పెంచడంతోపాటు మొబైల్ పార్టీలు ఏర్పాటు చేసి నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పర్యవేక్షణ అధికారులను నియమించనున్నారు. అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ షేక్షావలి, టౌన్ డీఎస్పీ డీవీరమణమూర్తి, సీఐలు సుబ్రమణ్యం, దివాకర్‌రెడ్డి, రోడ్డు రవాణా అధికారులు పాల్గొన్నారు. -
మట్కాపై ఉక్కుపాదం
- విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించం - సెట్ కాన్ఫరెన్స్‌లో ఎస్పీ గోపీనాథ్ జట్టి కర్నూలు: మట్కాపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ అధికారులను ఎస్పీ గోపీనాథ్‌జట్టి ఆదేశించారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు జిల్లాలోని అన్ని స్టేషన్ల పోలీసు అధికారులు, సబ్ డివిజన్ పోలీసు ఆఫీసర్లతో ఎస్పీ..సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మట్కాతో పాటు పేకాట, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బేసిక్ పోలీసింగ్‌పై క్షేత్రస్థాయి అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు. విధి నిర్వహణలో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. సమస్యాత్మక వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. ఫ్యాక్షన్ నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధినిర్వహణలో అలసత్వాన్ని సహించబోమని హెచ్చరించారు. నగర సీఐలతో డీఎస్పీ సమీక్ష... సెట్ కాన్ఫరెన్స్‌లో ఎస్పీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పని చేయాలని డీఎస్పీ రమణమూర్తి నగర సీఐలకు సూచించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు నగర పరిధిలోని సీఐలతో నేరాలపై సమీక్షించారు. సీఐలు కృష్ణయ్య, డేగల ప్రభాకర్, మహేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరావు, నాగరాజు యాదవ్, నాగరాజురావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఎస్పీ ఆదేశాలకు అనుగుణంగా నగర పరిధిలోని పోలీసు అధికారులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.