‘అయోధ్య’పై నవాబ్ భారీ ప్రకటన
లక్నో: అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ బకల్ నవాబ్ అన్నారు. రామ జన్మభూమిలో ఆలయం నిర్మాణానికి 15 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తానని ఆయన ప్రకటించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తనకు భూ పరిహారం కింద రానున్న రూ. 15 కోట్లకు మందిరం నిర్మాణానికి విరాళంగా ఇస్తానని తెలిపారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు.
‘శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టాడు కాబట్టి ఇక్కడే రామమందిరం కట్టాల్సిందేన’ని నవాబ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి ఆయనకు 30 కోట్ల రూపాయల భూ పరిహారం అందుతుందని భావిస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్కు సన్నిహితుడైన బకల్ నవాబ్ మందిర నిర్మాణానికి భారీ విరాళం ఇచ్చేందుకు ముందుకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.