'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు'
- జిల్లా ఎస్పీ డాక్టర్ బి.నవీన్‌కుమార్
పూడూరు (రంగారెడ్డి జిల్లా) : జిల్లాలో ప్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను పటిష్టం చేసి శాంతి భద్రతలను కాపాడతామని రంగారెడ్డి జిల్లా ఎస్పీ డాక్టర్ బి.నవీన్ కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చన్గోముల్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, దొంగతనాల గురించి స్థానిక ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని అనడంతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఆత్మహత్యలను నివారిస్తామని అన్నారు.
పోలీస్ స్టేషన్ పనితీరు, సిబ్బంది వివరాలు, రాత్రి పెట్రోలింగ్ ,రికార్డుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో నేరస్తుల,రౌడీషీటర్ల ఫొటోలు, వారి కేసుల వివరాలను డిస్ప్లే చేయాలని ఎస్ఐకి సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసులను చేధించవచ్చన్నారు. ప్రజలకు, పోలీసుల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొల్పేలా చూడాలని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. అప్పుడే నేరాలను అదుపు చేసేందుకు వీలుంటుందని అన్నారు.
జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకుంటామని అన్నారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. మీర్జాపూర్ శివారులో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే కోణాలను తెలుసుకుని సంబంధిత అధికారులకు వివరించాలని అన్నారు.ఎస్పీ వెంబడి చేవెళ్ల ఇంచార్జీ డీఎస్పీ స్వామి,చేవెళ్ల సీఐ ఉపేందర్,సిబ్బంది ఉన్నారు.