SP Ramakrishna
-
లైంగిక దాడి నిందితుడి అరెస్టు
గుంటూరు: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని గుంటూరు అర్బన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణంలోని అర్బన్ కాన్ఫరెన్స్ హాలులో అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ వివరాలు వెల్లడించారు. గుంటూరులోని రామిరెడ్డి నగర్ 7వ లైనులో ఓ వివాహిత తన ఐదేళ్ల కుమార్తెతో కలసి నివాసం ఉంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. యూకేజీ చదువుతున్న ఆమె కుమార్తె(5) ఈ నెల 11వ తేదీ సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా 19 ఏళ్ల నిందితుడు బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి వెంటనే నగరంపాలెం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాలికను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని శనివారం చుట్టుగుంట సెంటర్లో అదుపులోకి తీసుకుని విచారించగా లైంగికదాడికి పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ,అట్రాసిటీ, పోక్సో యాక్ట్‌తో పాటుగా సెక్షన్ 376(2)ఐ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, ఆపదలో ఉన్న వారు డయల్ 100తో పాటుగా 86888 31568 వాట్సాప్ నంబరును సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ పర్యవేక్షణలో ఫాస్ట్‌ట్రాక్‌లో దర్యాప్తు పూర్తి చేసి 15 రోజుల్లో చార్జిషీటును దాఖలు చేస్తామని ఎస్పీ తెలిపారు. -
అయిన వాళ్లే మోసం చేశారు!
సాక్షి, గుంటూరు ఈస్ట్ : జిల్లా పోలీసు కార్యాలయంలోని అర్బన్ జిల్లా సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వందకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. పలువురు వృద్ధులు తమ సంతానం తమ వద్ద ఆస్తులు తీసుకుని అన్నం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదులు విచారించి న్యాయం చేస్తామని బాధితులకు అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ హామీ ఇచ్చారు. బాధితుల సమస్యల్లో కొన్ని .... అధిక వడ్డీ వసూలు చేసి బెదిరిస్తున్నాడు పాతగుంటూరుకు చెందిన ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్ శెట్టిపల్లి వెంకట సుబ్బారావు వద్ద 2014లో మద్యం వ్యాపార నిమిత్తం రూ.25 లక్షలు అప్పుగా తీసుకున్నా. వివిధ దఫాలుగా అధికవడ్డీతో రూ.47,27,500 చెల్లించాను. నా నుంచి తీసుకున్న సంతకం చేసిన ఖాళీ బాండ్ పేపర్లు, 6 ప్రామిసరీ నోట్లు నాకు ఇవ్వకుండా ఇంకా వడ్డీ డిమాండు చేస్తున్నాడు. నా ఆస్తి అక్రమంగా రాసుకుంటానని ,అక్రమ దావాలు వేసి పరువు తీస్తానని బెదిరిస్తున్నాడు. –శంకరరావు, గుంటూరు అంగడి జ్యోతి కుటుంబానికి న్యాయం చేయాలి వైద్యుల అభిప్రాయం సరైన సమయంలో అధికారులు పంపని కారణంగా ప్రభుత్వం నుంచి మాకు అందాల్సిన సహాయంలో రూ.3 లక్షలు రద్దయ్యాయి. అట్రాసిటీ యాక్ట్ ప్రకారం అందాల్సిన రాయితీలు అందలేదు. మొదట పోస్టుమార్టం చేసిన డాక్టర్ భారతి కేసు విచారణలో అలసత్వం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి. మంగళగిరి పోలీసుల చర్యలు మాకు అనుమానంగా ఉన్నందున జ్యోతి హత్య కేసు సీబీఐకు అప్పగించాలి. హత్య జరిగిన ప్రదేశంలో సెల్ఫోన్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు ఎక్కడ ఉన్నాయో నేటికీ గుర్తించలేదు.నిందితులకు వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. – అంగడి ప్రభాకర్, అంగడి జ్యోతి సోదరుడు కుమారులు అన్నం పెట్టడం లేదు రూ. 2కోట్లు విలువ చేసే పొలాన్ని ఇద్దరు కుమారులు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. నాకు కిడ్నీ ఆపరేషన్ అయినా పట్టించుకోలేదు. ప్రస్తుతం అన్నం కూడా పెట్టడం లేదు. –భీమిరెడ్డి చినసాంబిరెడ్డి, కొత్తపాలెం,మంగళగిరి మండలం కుమారుడు ఇల్లు ఆక్రమించుకున్నాడు రెండవ భార్య చనిపోయింది.ఒంటరిగా నివసిస్తున్నా.మొదటి భార్య కొడుకు నేను ఇంట్లో లేని సమయంలో ఇంటి తాళం పగులగొట్టి ఇల్లు ఆక్రమించుకున్నాడు.ఇంట్లోకి వెళితే కొట్టి బయటకు నెట్టేశాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. అనారోగ్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న నేను అడుక్కుని తింటున్నా. –తాడిబోయిన బోసు, తాడికొండ కుదువ పెట్టిన నగలు తిరిగి ఇవ్వడం లేదు లాలాపేటలోని కిరణ్ జ్యూయలర్స్ యజమాని వద్ద 2016లో 210 గ్రాముల బంగారు నగలు కుదువ పెట్టి రూ.1,70 లక్షల నగదు తీసుకున్నాను. వడ్డీతో కలిపి మొత్తం చెల్లించగా రసీదులు ఇచ్చాడు. ఆ సమయంలో కిరణ్ అనారోగ్యం కారణంగా షాపు మూసివే సి ఇంట్లో ఉన్నాడు. నగలు వేరే చోట కుదువ పెట్టా నని త్వరలో తెచ్చి ఇస్తానని నమ్మించాడు. నగలు ఇవ్వకపోగా బెదిరిస్తున్నాడు. –పి.కౌషిక్, పాతగుంటూరు ప్రభుత్వ టీచర్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సురేష్ తో 2012లో నాకు వివాహం అయింది. 2013లో నన్ను పుట్టింట్లో వదిలి వెళ్లి పోయాడు. కాపురానికి తీసుకు వెళ్తానని చెప్పి రాకపోవడంతో 2015లో కోర్టులో కేసు వేశాను. అయితే నా భర్త 2014 లో ఓ మహిళను వివాహం చేసుకుని కుమార్తె పుట్టిన అనంతరం ఆమెను వదిలి వేశాడని తెలిసింది. ప్రస్తుతం అతనితో పాటు పనిచేసే మరో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని వివాహం చేసుకున్నాడు. నాకు న్యాయం చేయాలి. –నీలం శాంతి, సంజీవ నగర్, గుంటూరు అక్క, బావ అన్యాయం చేశారు పిత్రార్జితమైన అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌ను 2015లో నలుగురు అక్కలకు రూ.9.60 లక్షలు చెల్లించి రిజిష్టర్ కార్యాలయం ద్వారా హక్కు విడుదల దస్తావేజు రిజిస్టర్ చేయించుకున్నాను. రెండవ అక్క అనిత భర్త బొల్లెద్దుల ప్రసాద్ మా నాన్న పేరు మీద ఉన్న ఎస్బీఐ షేర్లు ట్రాన్స్ఫర్ కోసం అని చెప్పి ఖాళీ స్టాంప్ పేపర్ల మీద నా నుంచి సంతకాలు తీసుకున్నాడు. నేను ఇంటిని అక్క అనితకు అమ్మినట్లుగా విక్రయ స్వాధీన అగ్రిమెంటు తయారుచేయించాడు. నేను ఇంట్లో లేని సమయంలో తాళాలు పగుల గొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. ప్రశ్నించినందుకు నన్ను గాయపరిచారు. విచారించి న్యాయం చేయాలి. –కొత్తసిరి అమూల్య, ఏటీ అగ్రహారం స్నేహితులే ముంచేశారు 2018 డిసెంబర్లో కొత్తకారు కొనుగోలు చేశాను. 2019 ఏప్రిల్‌లో నా మిత్రుడు గోపి నా కారు తీసుకువెళ్లి అతని మిత్రులైన పూర్ణ, పవన్‌కుమార్‌కు ఇచ్చాడు. వారు ప్రకాశం జిల్లాలో కారును చెట్టుకు ఢీకొట్టి ప్రమాదానికి గురిచేశారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి ఎల్ఎల్ఆర్మాత్రమే ఉండటంతో నాకు బీమా సొమ్ము కూడా రాలేదు. కొత్త కారు కొనిస్తామని హామీ ఇచ్చి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. జూలై 15న ఎస్పీ స్పందనలో ఫిర్యాదు చేస్తే కాపీ తమకు రాలేదని పాతగుంటూరు పోలీసులు తిప్పుతున్నారు. నాకు న్యాయం చేయాలి. –గుడిపూడి విజయబాబు, మంగళదాసు నగర్, గుంటూరు భూమికి ఎన్ఓసీ ఇప్పిస్తానని మోసం చేశాడు 2014లో వినుకొండలోని రెండు ఎకరాల 43 సెంట్ల పొలాన్ని నలుగురు భాగస్వాములతో కలిసి కొనుగోలు చేశాం. రిజిస్ట్రార్ ఆఫీసులో సంప్రదించగా డి లిస్టులో ఉందని తెలిసింది. నా భాగస్వాముల్లో ఒకరికి స్నేహితుడైన బలగం ప్రకాష్ కలెక్టర్ కార్యాలయంలో పలుకుబడి ఉందని చెప్పి ఎన్ఓసీ ఇప్పిస్తానని నమ్మించాడు. పలు దఫాలుగా రూ.40 లక్షలు చెల్లించాం. డబ్బులు అడుగుతుంటే బెదిరిస్తున్నాడు. న్యాయం చేయాలి. –రొడ్డా బ్రహ్మానంద రెడ్డి, స్తంభాల గరువు -
అక్రమార్కుల భరతం పడతా..
► ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణా అంతు చూస్తా ► పోలీస్, ప్రజల మధ్య అంతరాన్ని తొలగిస్తా ► ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ నెల్లూరు సిటీ: ‘అక్రమార్కుల భరతం పడతా. ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతా. పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేస్తా’నని జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పీహెచ్డీ రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన విధుల్లో చేరారు. ముందుగా తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు పోలీస్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు బాధ్యతలు చేపట్టారు. ఏఎస్పీ శరత్‌బాబు, ఏఆర్ ఏఎస్పీ సూరిబాబు, ఎస్బీ డీఎస్పీ కోటారెడ్డి, నగర డీఎస్పీ వెంకట రాముడు, రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, పలువురు డీఎస్పీలు, సీఐలు రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి జిల్లాలో ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణా పెద్దఎత్తున సాగుతున్నట్టు తన దృష్టికివచ్చిందని, వీటిపై ప్రత్యేక దృష్టి సారించి అక్రమ రవాణాకు అడ్డకట్ట వేస్తానని ఎస్పీ చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహించే ‘గ్రీవెన్స్ డే’ సందర్భంలో జిల్లాలోని ప్రతి పోలీసు అధికారి ప్రధాన కేంద్రంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అవసరమైతే గురువారం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మంచి చరిత్ర కలిగిన నెల్లూరు జిల్లాకు ఎస్పీగా రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు, పోలీసుల మధ్య అంతరాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. అవినీతిపరులపై ప్రత్యేక దృష్టి సారించి సరిచేస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరులో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, త్వరలోనే దీనిని క్రమబద్ధీకరిస్తానన్నారు. ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేస్తానని తెలిపారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ నెలకొల్పుతామన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తనను ఫోన్లో సంప్రదించవచ్చని తెలిపారు. ఫోన్ ద్వారా 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. -
సాంకేతికతతో సైబర్ నేరాలకు చెక్
- ఎస్ఐల శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ కమలాపురం: ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగి పోతున్నాయని, వాటిని నూతన సాంకేతికతతో చెక్ పెట్టేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. స్థానిక సీఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఆర్ఆర్ఎం డిగ్రీ, పీజీ కళాశాల కంప్యూటర్ ల్యాబ్‌లో రాయలసీమ జిల్లాలోని 34 మంది ఎస్ఐలకు ఇస్తున్న మూడు రోజుల శిక్షణను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలో వాట్సాప్, ఫేస్బుక్, ఈ – మెయిల్ తదితర వాటి ద్వారా సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని, వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. సాంకేతికతను వినియోగించుకోవాలి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను వినియోగించుకుని సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను గుర్తుంచుకుని కేసుల పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కళాశాల కరస్పాండెంట్ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కళాశాల విద్యార్థులకు కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం ఆయన ఎస్పీకి నాలుగు సింహాల అశోక స్తంభాన్ని బహూకరించారు. ట్రైనర్స్ దుర్గా ప్రసాద్, చందు సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు చేపట్టాల్సిన అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో కడప డీఎస్పీ ఈజీ అశోక్ కుమార్, ఎర్రగుంట్ల సీఐ శ్రీనివాసులరెడ్డి, కమలాపురం ఎస్ఐ మహమ్మద్ రఫీ, సీమ జిల్లాల్లోని ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఏఆర్ ఎస్ఐ సతీమణికి రూ. 2 లక్షల చెక్కు పంపిణీ
కడప అర్బన్ : జిల్లా పోలీసు యంత్రాంగంలో ఏఆర్ ఎస్ఐగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఎస్.నాగార్జున నాయక్ సతీమణి గీతకు కుటుంబ సభ్యుల సమక్షంలో జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ రూ. 2 లక్షల చెక్కును గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. పోలీసు కాంట్రిబ్యూటరీ నిధి నుంచి ఈ డబ్బును ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్కక్రమంలో ఏఆర్ డీఎస్పీ మురళీధర్, ఆర్ఐ ఈశ్వర్రావు పాల్గొన్నారు. -
కోదండరాముని సన్నిధిలో జిల్లా ఎస్పీ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరాముడిని జిల్లాఎస్పీ పీహెచ్డీ రామక్రిష్ణ సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ సీతారాములకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎస్పీకి ఆలయ విశిష్టతల గురించి తెలియజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. పూలమాలలు, స్వామివారి శేషవస్త్రంతో ఎస్పీని సత్కరించారు. -
కోదండరాముని సన్నిధిలో జిల్లా ఎస్పీ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరాముడిని జిల్లాఎస్పీ పీహెచ్డీ రామక్రిష్ణ సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ సీతారాములకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎస్పీకి ఆలయ విశిష్టతల గురించి తెలియజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. పూలమాలలు, స్వామివారి శేషవస్త్రంతో ఎస్పీని సత్కరించారు.