సాంకేతికతతో సైబర్ నేరాలకు చెక్
- ఎస్‌ఐల శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ
కమలాపురం: ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగి పోతున్నాయని, వాటిని నూతన సాంకేతికతతో చెక్ పెట్టేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. స్థానిక సీఎస్‌ఎస్‌ఆర్ అండ్ ఎస్‌ఆర్‌ఆర్‌ఎం డిగ్రీ, పీజీ కళాశాల కంప్యూటర్ ల్యాబ్‌లో రాయలసీమ జిల్లాలోని 34 మంది ఎస్‌ఐలకు ఇస్తున్న మూడు రోజుల శిక్షణను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఈ – మెయిల్ తదితర వాటి ద్వారా సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని, వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందన్నారు.
సాంకేతికతను వినియోగించుకోవాలి
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను వినియోగించుకుని సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను గుర్తుంచుకుని కేసుల పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కళాశాల కరస్పాండెంట్ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కళాశాల విద్యార్థులకు కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం ఆయన ఎస్పీకి నాలుగు సింహాల అశోక స్తంభాన్ని బహూకరించారు. ట్రైనర్స్ దుర్గా ప్రసాద్, చందు సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు చేపట్టాల్సిన అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో కడప డీఎస్పీ ఈజీ అశోక్ కుమార్, ఎర్రగుంట్ల సీఐ శ్రీనివాసులరెడ్డి, కమలాపురం ఎస్‌ఐ మహమ్మద్ రఫీ, సీమ జిల్లాల్లోని ఎస్‌ఐలు పాల్గొన్నారు.