ప్రజల ముంగిట 'అంతరిక్ష ఎగ్జిబిషన్'
– ఇస్రో ఆధ్వర్యంలో రేపు, ఎల్లుండి నిర్వహణ
– నేటి ఉదయం 7.30 గంటలకు స్పేస్ అవేర్నెస్ వాక్
– అంతరిక్ష సైన్స్‌పై ప్రజలకు అవగాహన కోసం ఏర్పాటు
– 3 రాష్ట్రాలు..17 జిల్లాల్లో ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు ప్రణాళిక
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సామాన్య ప్రజలకు అంతరిక్ష సైన్స్‌పై అవగాహన కల్పించేందుకు ఇస్రో నడుం బిగించింది. షార్‌లో ప్రయోగిస్తున్న రాకెట్లు, క్షిపణులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యుద్ధ విమానాలను జనం ప్రత్యక్షంగా వీక్షించేందుకు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా 'స్పేస్ ఎగ్జిబిషన్ల' నిర్వహణకు ప్రణాళికలు రచించింది. గతంలో ఒక్క నెల్లూరులోని సుల్లూరుకే పరిమితమైన ఈ ఎగ్జిబిషన్లను నేడు మూడు రాష్ట్రాల్లోని 17 జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అందులో మొట్ట మొదటి సారిగా కర్నూలులోని సెయింట్ జోసెప్ డిగ్రీ కళాశాలలో శుక్ర, శనివారాల్లో స్పేస్ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు ఇస్రో అధికారులు చర్యలు తీసుకున్నారు. గురువారం ఉదయం 7.30 గంటలకు కొండారెడ్డి బురుజు నుంచి రాజ్‌విహార్ వరకు స్పేస్ వాక్‌ను కూడా నిర్వహిస్తున్నారు.
అంతరిక్ష సైన్స్‌పై అవగాహన కోసమే..
అంతరిక్ష వారోత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఇస్రో చర్యలు తీసుకుంది. భావిశాస్త్రవేత్తలుగా భావించే విద్యార్థులకు అంతరిక్ష సైన్స్‌పై అవగాహనకు స్పేస్ ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఇస్రో అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలు కూడా తమకు అందే సెల్‌ఫోన్, రేడియో, టీవీ, ఇంటర్నెట్ తదితర సదుపాయాల గురించి వివరిస్తారు.
ఎగ్జిబిషన్లో ఏఏ పరికరాలు ఉంటాయి?
రెండు రోజులుపాటు జరిగే స్పేస్ ఎగ్జిబిషన్లో రాకెట్లు, క్షిపణులు, ఇంజిన్లు, ఆయా పరికరాల విడిభాగాలను ప్రదర్శనకు ఉంచుతారు. అంతేకాక ప్రతి పరికరం దగ్గర ఇస్రో శాస్త్త్రవేత్తలు ఉండి అది ఎలా పనిచేస్తుంది.ఎందుకు ఉపయోగపడుతుంది..ఎంత దూరం ప్రయాణిస్తుంది..తదితర సందేహాలను తీర్చుతారు.
ప్రజలు, విద్యార్థులకు సువర్ణావకాశం..
ఇస్రో ఏర్పాటు చేస్తున్న స్పేస్ ఎగ్జిబిషన్ ప్రజలకు సువర్ణావకాశంగా భావించవచ్చు. ఇప్పటి వరకు దీన్ని చూడాలనుకుంటే నెల్లూరు, బెంగళూరు, ముంబాయి తదితర ప్రాంతాల్లోని అంతరిక్ష ప్రయోగ శాలలకు వెళ్లాలి. అక్కడ సందర్శకుల పాసు తీసుకోవాలి. వీటన్నింటికీ బోలెడు డబ్బు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో ఇస్రోనే ప్రజల ముంగిటకు స్పేస్ ఎగ్జిబిషన్ పేరిట రాకెట్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను ఉంచడం అరుదైన విషయం. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడుతుంది. సామాన్య ప్రజలు సైతం స్పేస్‌వాక్‌ను వీక్షించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ప్రవేశం ఉచితం..
సెయింట్ జోసెప్ డిగ్రీ కళాశాలలో శుక్ర, శనివారాల్లో ఏర్పాటయ్యే స్పేస్ ఎగ్జిబిషన్ ప్రవేశం ఉచితం. జిల్లాలోని ఇంజినీరింగ్, వైద్యం, ఫార్మసీ, డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఈడీ తదితర కోర్సులను చదివే విద్యార్థులు ఎగ్జిబిషన్‌ను సందర్శించి వీక్షించవచ్చు.
అన్ని ఏర్పాట్లు చేశాం – డాక్టర్ రబ్బానీ, ఇస్రో శాస్త్రవేత్త
అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా కర్నూలులోని సెయింట్ జోసెప్ డిగ్రీ కళాశాలలో స్పేస్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసేందుకు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ రబ్బాన్నీ తెలిపారు. బుధవారం ఆయన జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో రవీంద్ర విద్యా సంస్థల అధినేత మోహన్‌కుమార్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. ఆరో తేదీ ఉదయం 7.30 గంటలకు కొండారెడ్డి బురు జు నుంచి రాజ్‌విహార్‌కు వరకు స్పేస్‌వాక్ ఉంటుందన్నారు. ఇందులో జిల్లాలోని విద్యార్థులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సతీష్‌కుమార్ పాల్గొన్నారు.